నగర నడిబొడ్డున ‘గులాబీ’ వసంతం.. పర్యాటకులను కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు

by Ramesh Naini |

నగరం అద్భుతమైన గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. నేరుల్ లోని ఎన్.ఆర్.ఐ కాంప్లెక్స్ వెనుక ఉన్న క్రీక్ ప్రాంతానికి వేలాదిగా చేరుకున్న ఫ్లెమింగో పక్షులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

నగర నడిబొడ్డున ‘గులాబీ’ వసంతం.. పర్యాటకులను కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నవీ ముంబై నగరం అద్భుతమైన గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. నేరుల్ లోని ఎన్.ఆర్.ఐ (NRI) కాంప్లెక్స్ వెనుక ఉన్న క్రీక్ ప్రాంతానికి వేలాదిగా చేరుకున్న ఫ్లెమింగో పక్షులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నగర నడిబొడ్డున ప్రకృతి ఆవిష్కరించిన ఈ అందమైన దృశ్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం (మే 16న) థానే క్రీక్ పరిసరాలు ఈ వలస పక్షుల రాకతో పూర్తిగా గులాబీ మయంగా మారిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి అలసిపోయిన వేలాది పక్షులు ఇక్కడి నీటిలో సేదతీరుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ పంచుకుంది. ప్రకృతి సృష్టించిన ఈ గులాబీ తివాచీని కళ్లారా చూసేందుకు స్థానికులు, పక్షి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఇక్కడి చిత్తడి నేలలకు (Wetlands) చేరుకుంటున్నారు.

ఈ ఏడాది కాస్త ఆలస్యంగా..

ప్రతి సీజన్‌లో ఈ పక్షులు ఆఫ్రికా, ఇరాన్ వంటి విదేశాల నుంచి వలస వస్తాయని వన్యప్రాణి పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలోని ప్రధాన వలస పక్షుల మార్గాల్లో ఒకటైన ‘సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే’ (Central Asian Flyway) ద్వారా ఇవి ప్రతి ఏటా ప్రయాణిస్తుంటాయి. నవీ ముంబైకి చేరుకోవడానికి ముందు, అవి ఆహారం, విశ్రాంతి కోసం గుజరాత్‌లోని ‘రాన్ ఆఫ్ కచ్’ ప్రాంతంలో కాస్త విరామం తీసుకుంటాయని వన్యప్రాణి పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా ఈ వలస పక్షులు శీతాకాలంలో, అనగా నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ముంబైకి చేరుకుంటాయి. అయితే, ఈ సీజన్‌లో ఇవి కాస్త ఆలస్యంగా వచ్చాయని, అందుకే ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇక్కడే ఉండిపోయాయని వన్యప్రాణి పరిశోధకులు తెలుపుతున్నారు.

వీక్షించడానికి అనువైన ప్రదేశాలు ఇవే..

థానే క్రీక్, పామ్ బీచ్ రోడ్, నేరుల్ లోని ఎన్.ఆర్.ఐ కాంప్లెక్స్, కరావే ఫ్లెమింగో పాయింట్, బేలాపూర్ క్రీక్‌లు అనువైన ప్రదేశాలుగా ఉన్నాయి. పక్షి ప్రేమికులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 6:30 నుంచి 9:00 గంటల వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల మధ్య ఈ ఫ్లెమింగో పక్షులను వీక్షించడానికి అత్యంత అనువైన సమయం అని చెబుతున్నారు.

Next Story