వ్యక్తిగత భద్రత తొలగింపు.. న్యాయ పోరాటానికి దిగిన హర్భజన్ సింగ్

by Kema Shiva Kumar |

తన భద్రతను ఉపసంహరించుకుంటూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.

వ్యక్తిగత భద్రత తొలగింపు.. న్యాయ పోరాటానికి దిగిన హర్భజన్ సింగ్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాజ్యసభ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పంజాబ్ ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి దిగారు. తన పర్సల్ సెక్యూరిటీని (Personal Security) ఉపసంహరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) హైకోర్టును ఆశ్రయించారు. పంజాబ్‌లో ఎంపీ రాఘవ్ చద్దా‌తో పాటు మరో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో భగవంత్ మాన్ ప్రభుత్వం ఇటీవల వారికి ఉన్న భద్రతను సమీక్షించి.. సెక్యూరిటీని తొలగించారు.

ఆ జాబితాలో హర్భజన్ సింగ్ పేరు కూడా ఉండటంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా భద్రతను ఎలా తొలగిస్తారని ఆయన పిటిషన్‌లో ప్రశ్నించారు. సెక్యూరిటీని తొలగించే ముందు తనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఓ బాధ్యతాయుతమైన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే, హర్భజన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Next Story