31 ఏళ్ల జైలు జీవితం తర్వాత.. న్యాయవాదిగా మారిన రాజీవ్ గాంధీ హత్య కేసు మాజీ దోషి

by Ramesh Naini |

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి, 2022లో విడుదలైన ఏ.జీ. పేరరివాలన్ (54) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

31 ఏళ్ల జైలు జీవితం తర్వాత.. న్యాయవాదిగా మారిన రాజీవ్ గాంధీ హత్య కేసు మాజీ దోషి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి, 2022లో విడుదలైన ఏ.జీ. పేరరివాలన్ (54) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆయన తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా లాంఛనంగా నమోదయ్యారు. ఏప్రిల్ 27న నల్లకోటు ధరించిన పేరరివాలన్, సోమవారం బార్ కౌన్సిల్‌లో అధికారికంగా చేరారు. ఈ కార్యక్రమానికి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, బార్ కౌన్సిల్ చైర్మన్ పి.ఎస్. అమల్ రాజ్, వైస్ చైర్మన్ ఎస్. ప్రభాకరన్ తదితరులు హాజరయ్యారు. ఎన్‌రోల్‌మెంట్ కమిటీ చైర్మన్ కె. బాలు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సుదీర్ఘ జైలు జీవితం..

బాంబు తయారీకి వాడిన 9-వోల్ట్ బ్యాటరీని సరఫరా చేశారన్న ఆరోపణలతో 1991లో (తన 19వ ఏట) ఆయన అరెస్టయ్యారు. మూడు దశాబ్దాల జైలు జీవితం తర్వాత, సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి 2022 మే 18న ఆయనను విడుదల చేసింది. బెంగళూరులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బీ డిగ్రీని పూర్తి చేసిన ఆయన, 2025లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) పాసయ్యారు.

న్యాయపోరాటమే స్పూర్తి

తన సుదీర్ఘ న్యాయపోరాటమే న్యాయ శాస్త్రం చదివేందుకు తనకు స్ఫూర్తినిచ్చిందని పేరరివాలన్ తెలిపారు. ఇకపై మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ.. అక్రమంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు న్యాయ సాయం అందించడం, క్రిమినల్ జస్టిస్, శిక్షానంతర సంస్కరణల (post-conviction reforms) పైనే ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆయన వెల్లడించారు.

Next Story