Mohan Bhagwat: కులం ఆధారంగా ప్రజలను అంచనా వేయకూడదు: ఆర్ఎస్ఎస్ చీఫ్

by Prasad Jukanti |   (  Updated:2025-12-31 12:54:07  IST  )

విభజన, వివక్ష భావాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Mohan Bhagwat:  కులం ఆధారంగా ప్రజలను అంచనా వేయకూడదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులం, సంపద, భాష ఆధారంగా ప్రజలను అంచనా వేయకూడదని ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. ఈ దేశం అందరిదన్నారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా సోన్‌పైరి గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామరస్యానికి తొలి అడుగు మనసులోని విభజన, వివక్ష భావాలను తొలగించి అందరినీ మనవారిలా చూడడమేనన్నారు. మొత్తం దేశం అందరిదే అనే భావననే నిజమైన సామాజిక సామరస్యం అని ఆయన పేర్కొన్నారు. కుటుంబ అనుబంధాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. కుటుంబ సభ్యులు కనీసం వారానికి ఒక రోజు కలిసి గడపాలని, తమ విశ్వాసానికి అనుగుణంగా ప్రార్థనలు చేయాలని ఇంట్లో వండిన భోజనం కలిసి తినాలి, అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించారు. ఈ చర్చలను ఆయన ‘మంగళ సంవాద్' గా అభివర్ణించారు.

ఒంటరితనం పెరిగితే ప్రజలు చెడు అలవాట్లకు దారి తీసే ప్రమాదం ఉంటుందని అందువల్ల కుటుంబంలో నిరంతర పరస్పర సంభాషణలు ఉండాలని అలాంటప్పుడే చెడు వ్యవసాల వైపు మళ్లే పరిస్థితులను నివారించగలమన్నారు. సామాజిక సామరస్యం, పర్యావరణ బాధ్యత, క్రమశిక్షణ గల పౌర జీవనం అవసరమని.. సమాజం విభేదాలను దాటి దేశం కోసం కలిసి పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక సామరస్యానికి తొలి మెట్టు విభజన, వివక్ష భావాలను తొలగించడమేనని మరోసారి స్పష్టం చేశారు. ఆలయాలు, నీటి వనరులు, శ్మశానవాటికలు అన్ని హిందువులకు అందుబాటులో ఉండాలని, సామాజిక సేవ ఐక్యతకు ప్రతీక కావాలని, సంఘర్షణకు కాదన్నారు. నీటి పొదుపు, వర్షపు నీటి నిల్వ, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ తగ్గింపు, మొక్కల పెంపకం వంటివి ఇంటి నుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇంట్లో మాతృభాష వాడకం, భారతీయ వేషధారణకు గౌరవం, ఔషధాలు వంటి అవసరమైనవి మినహా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్వదేశీ, ఆత్మనిర్భరతను ప్రోత్సహించాలని సూచించారు. రాజ్యాంగం, చట్టాలు, పౌర క్రమశిక్షణను పాటించాలని, రాజ్యాంగ ప్రవేశిక, మౌలిక కర్తవ్యాలు, పౌరుల బాధ్యతలను క్రమం తప్పకుండా చదివి ఆచరించాలని, పెద్దల పట్ల గౌరవం, అవసరమైన వారికి సహాయం వంటి సంప్రదాయ విలువలను పాటించాలని చెప్పారు.

Next Story