- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Madhya Pradesh: ఉచితాలపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రజలు సమర్పించే వినతులపై మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజలు సమర్పించే వినతులపై మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతిబాయి లోధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గని ప్రసంగించారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారన్న ఆయన.. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా అభివర్ణించారు. ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి భిక్షాటన చేసే అలవాటును ప్రజలు పెంచుకున్నారు. నాయకులు వచ్చినప్పుడు వినతులతో కూడిన కట్టలను అందజేస్తారు. వారికి వేదికలపైనే దండలు వేస్తారు. వారి చేతుల్లో లేఖలు ఉంచుతారు. ఇది మంచి అలవాటు కాదు. అడగడానికి బదులుగా, ఇచ్చే మనస్తత్వాన్ని పెంపొందించుకోండి. ఇది సంతోషకరమైన జీవితానికి దారి తీస్తుంది. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడంలో సాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా’ అని అన్నారు.
ఉచితాలపై..
అంతేకాకుండా, ప్రజలు ఉచితాలపై అధికంగా ఆధారపడటం వల్ల సమాజాన్ని బలహీనపరుస్తున్నామని మంత్రి ప్రహ్లాద్ పటేల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలహీనపరుస్తున్నారు. ఉచితాల పట్ల ఆకర్షణ ధైర్యవంతులైన మహిళల గౌరవానికి చిహ్నం కాదు. మనం విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే అమరవీరులుగా గౌరవింపబడతాం. ఎప్పుడైనా భిక్షాటన చేసిన అమరవీరుడి పేరు చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. నర్మద పరిక్రమ యాత్రికుడిగా తాను భిక్ష అడుగుతానని.. కానీ తన కోసం మాత్రం కాదని చెప్పారు. కాగా, ప్రహ్లాద్ పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతు పట్వారీ విమర్శలు గుప్పించారు. పటేల్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. పట్వారీ మాట్లాడుతూ.. ‘బీజేపీ అహంకారం ఎంత స్థాయికి చేరిందంటే వారు ప్రజలను యాచకులు అని పిలుస్తున్నారు. ఎన్నికలకు ముందు తప్పుడు హామీలు చేసి, వాటిని నెరవేర్చడానికి నిరాకరిస్తున్నారు. ప్రజలు వాటిని గుర్తుచేసినప్పుడు అడుక్కుంటున్నారని వారినే తిడుతున్నారు. త్వరలో ఈ బీజేపీ నాయకులు ఓట్లు అడుక్కోవడానికి వస్తారు’ అని చురకలు అంటించారు.






