- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు: విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిక
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగు పడింది. పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత ఈ చర్చలు మొదలైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని భేదాభిప్రాయాలు, ముందస్తు షరతుల కారణంగా చర్చలు ప్రారంభం కావడంలో సుమారు ఐదు గంటల పాటు జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇస్లామాబాద్‌లో రెండు దేశాల ప్రతినిధులు చర్చల మేజబద్దకు చేరుకున్నారు. చర్చలు మొదలైన విషయాన్ని వెల్లడిస్తూనే, ట్రంప్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, పరిస్థితులను మళ్ళీ మొదటికి (Reset) తీసుకొస్తామని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో తమ తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
పాకిస్తాన్ పాత్ర...
ఈ శాంతి చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. పాక్ సైనిక నాయకత్వం, ప్రభుత్వం ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ చర్చలు సఫలమైతే మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే, ట్రంప్ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో, చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదురుతుందనే అంశంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.






