ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన కేసు.. నలుగురికి కస్టడీ విధించిన కోర్టు

by Naga Rani Yarlagadda |

ఏఐ సమ్మిట్ లో ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ నలుగురు నేతలకు పటియాలా కోర్టు ఐదురోజుల కస్టడీ విధించింది.

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన కేసు.. నలుగురికి కస్టడీ విధించిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐ సమ్మిట్‌లో (AI Summit) యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళనపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనకు దిగారన్న ఆరోపణలతో అరెస్టయిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఏడు రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరారు. అయితే.. వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు.

సమ్మిట్ వంటి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి నిందితులు చొరబడటం తీవ్రమైన భద్రతా లోపమని పోలీసులు కోర్టుకు నివేదించారు. నిషేధిత ప్రాంతంలోకి చొరబడటం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినట్లు నిందితులపై కేసులు నమోదయ్యాయి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ఇతర రాజకీయ అంశాలపై నిరసన తెలుపుతూ ఏఐ సమ్మిట్ జరుగుతున్న వేదిక వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కస్టడీ ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగనుంది. పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Next Story