ఏసీ కోచ్‌ల్లో దుప్పట్లు, టవల్స్ దొబ్బేసిన ప్రయాణికులు! రూ.104 కోట్ల విలువైన బెడ్‌రోల్స్‌ చోరీ: ఆర్‌టీఐ నివేదిక

by Ramesh Naini |

భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణించే కొందరు ప్రయాణికుల చేతివాటం కాంట్రాక్టర్లకు, సిబ్బందికి భారీ నష్టాన్ని మిగులుస్తోంది.

ఏసీ కోచ్‌ల్లో దుప్పట్లు, టవల్స్ దొబ్బేసిన ప్రయాణికులు! రూ.104 కోట్ల విలువైన బెడ్‌రోల్స్‌ చోరీ: ఆర్‌టీఐ నివేదిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణించే కొందరు ప్రయాణికుల చేతివాటం కాంట్రాక్టర్లకు, సిబ్బందికి భారీ నష్టాన్ని మిగులుస్తోంది. గత నాలుగేళ్ల వ్యవధిలో (జనవరి 2022 నుంచి మే 2026 వరకు) ఏసీ బోగీల నుంచి ఏకంగా 1.27 కోట్ల బెడ్‌రోల్ (దుప్పట్లు, టవల్స్ తదితర) వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటి అంచనా విలువ సుమారు రూ. 104.51 కోట్లు ఉంటుందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తుల సంచలన నివేదిక ద్వారా వెల్లడైంది.

ఎక్కువగా మాయమైనవి అవే..!

రైల్వే శాఖ ఏసీ ప్రయాణికులకు రెండు బెడ్‌షీట్లు, ఒక బ్లాంకెట్, దిండు, దిండు కవర్, ఒక ఫేస్ టవల్‌ను ఉచితంగా అందిస్తుంది. అయితే, ట్రిప్ ముగిశాక వీటిలో చాలా వస్తువులు ప్రయాణికులతో పాటే మాయం అవుతున్నాయి. చోరీకి గురైన వస్తువుల్లో సులభంగా బ్యాగ్‌లో పెట్టుకోగలిగే ‘ఫేస్ టవల్స్’ టాప్‌లో ఉన్నాయి. నాలుగేళ్లలో 46.54 లక్షల టవల్స్ మాయమయ్యాయి. ఆ తర్వాత 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల పిల్లో (దిండ్లు) కవర్లు, 12.95 లక్షల బ్లాంకెట్లు, 2.76 లక్షల దిండ్లు అపహరణకు గురయ్యాయి. ప్రతి వెయ్యి మంది ప్రయాణికులలో సగటున ఒకరు ఏదో ఒక వస్తువును తీసుకెళ్తున్నట్లు డేటా చెబుతోంది.

బికనేర్ టాప్.. దక్షిణాది భేష్

రైల్వేలోని 18 జోన్లలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. వస్తువుల చోరీలో రాజస్తాన్‌లోని ‘బికనేర్’ డివిజన్ (25.76 లక్షల వస్తువులు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రాంచీ (9.31 లక్షలు), ఢిల్లీ (8.21 లక్షలు), ముంబై (8.17 లక్షలు), జోధ్‌పూర్, అహ్మదాబాద్ డివిజన్లు ఉన్నాయి. మొత్తంగా 2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ చోరీలు 56% మేర పెరిగాయి. అయితే దక్షిణాదికి చెందిన తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఎలాంటి చోరీలు నమోదు కాకపోవడం విశేషం.

సిబ్బంది జీతాల్లో కోత!

ఈ బెడ్‌రోల్స్ నిర్వహణ, పంపిణీ బాధ్యత కాంట్రాక్టర్లదే కావడంతో.. ఈ రూ.104 కోట్ల భారీ నష్టాన్ని వారే భరించాల్సి వస్తోంది. అయితే కాంట్రాక్టర్లు ఈ భారాన్ని.. కోచ్ అటెండెంట్ల జీతాల నుంచి కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమని, దొంగతనాలను అరికట్టేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ఈ చోరీల్లో రైల్వే సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

Next Story