smokes beedi: విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. ఢిల్లీ-గోవా ఫ్లైట్‌లో కలకలం

by Ramesh Naini |   (  Updated:2026-03-09 06:32:08  IST  )

విమానం గాలిలో ఉండగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి బీడీ తాగినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ నుండి గోవా వెళుతున్న విమానంలో జరిగింది.

smokes beedi: విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. ఢిల్లీ-గోవా ఫ్లైట్‌లో కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుండి గోవా వెళుతున్న ఆకాశ ఎయిర్ (Akasa Air) విమానంలో ఒక ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించి కలకలం సృష్టించాడు. విమానం గాలిలో ఉండగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి బీడీ తాగినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా, అధికారులు తాజాగా వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆశిష్ అనే వ్యక్తి శనివారం ఢిల్లీ నుండి గోవాకు ప్రయాణిస్తున్న QP 1625 విమానంలో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణ మధ్యలో ఎవరికీ తెలియకుండా వాష్‌రూమ్‌లోకి వెళ్లిన అతడు, అక్కడ బీడీ వెలిగించి తాగాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు.

భద్రతా నిబంధనల ఉల్లంఘన..

విమానంలోకి లైటర్ తీసుకెళ్లడం నిషేధం అయినప్పటికీ, నిందితుడు దానిని విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనేది చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుడి వద్ద లైటర్ ఉండటం విమానంలోని ఇతరుల భద్రతకు పెను ముప్పు కలిగించే అంశమని ఎయిర్‌లైన్ యాజమాన్యం తమ ఫిర్యాదులో పేర్కొంది. విమానం గోవాలోని మోపా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే, సిబ్బంది నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు, పౌర విమానయాన భద్రతా చట్టం కింద మోపా ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆకాశ ఎయిర్ సంస్థ ఈ ఘటనపై స్పందిస్తూ, తాము భద్రతా ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించామని, దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Next Story