Parliament: మూడో రోజూ రసాభాస.. ఎటువంటి చర్చ లేకుండానే ఉభయసభలు వాయిదా

by B.Srinivas |   (  Updated:2025-07-23 15:57:42  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజూ రసాభాస కొనసాగింది. బిహార్ ఓటరు జాబితా సవరణపై ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి.

Parliament: మూడో రోజూ రసాభాస.. ఎటువంటి చర్చ లేకుండానే ఉభయసభలు వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజూ రసాభాస కొనసాగింది. బిహార్ ఓటరు జాబితా సవరణపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి. కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే బిహార్ ఓటర్ల ధ్రువీకరణ అంశంపై ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. లోక్ సభలో వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నందున తాము సమాధానం చెప్పలేమని ప్రభుత్వం వాదించింది. ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. దీంతో ఎటువంటి చర్చ జరగకుండానే లోక్ సభ, రాజ్యసభ గురువారానికి వాయిదా పడ్డాయి. అలాగే వరుసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద తమ నిరసనను కొనసాగించారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

జూలై 28న లోక్‌సభలో. జూలై 29న రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌ (Operation sindhoor) పై చర్చ జరుగనున్నట్టు తెలుస్తోంది. దీనికి గాను 16 గంటలు టైం కేటాయించారు. ఈ మేరకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి: రాహుల్

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వాదనలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిమాండ్ చేశారు. ట్రంప్ ఇప్పటికి 25 సార్లు సీజ్ ఫైర్‌పై ప్రకటన చేశారని, అయినప్పటికీ కేంద్ర మౌనంగా ఉండటంతో తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏ దేశం కూడా భారతదేశానికి దౌత్యపరంగా మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. భారత విదేశాంగ విధానాన్ని కేంద్రం నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ట్రంప్ వాదన కారణంగానే మోడీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారని, ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారని ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెబుతుండగా, ట్రంప్ దానిని ఆపివేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు.

Next Story