Parliament: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన.. ఉభయసభల్లో గందరగోళం

by B.Srinivas |   (  Updated:2025-07-22 16:45:37  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది.

Parliament: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన.. ఉభయసభల్లో గందరగోళం
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజూ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. బిహార్‌లో ఓటర్ల జాబితా పరిశీలన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రతిపక్షాలు లోక్ సభ, రాజ్యసభలో నిరసన తెలిపాయి. అలాగే పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్ సభ ప్రారంభమైన కాసేపటికే 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు ఆందోళనలు కొనసాగించడంతో మరోసారి పోస్ట్ పోన్ అయింది. 2 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో స్పీకర్ బిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో సభ పలు మార్లు వాయిదా పడింది. అంతకుముందు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఉత్పన్నమయ్యే ఆందోళనలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ రూల్ 267 కింద వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నిరసనలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. బిహార్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎయిర్ఇండియా విమాన ప్రమాదం, డీలిమిటేషన్, మణిపూర్ ప్రస్తుత పరిస్థితిపై సభలో చర్చించాలని దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల సమస్యలపైనా మాట్లాడాలన్నారు

Next Story