Parliament: ఎస్ఐఆర్‌పై పట్టువీడని ప్రతిపక్షాలు.. ఉభయసభల్లో ఆందోళన

by B.Srinivas |

బిహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

Parliament: ఎస్ఐఆర్‌పై పట్టువీడని ప్రతిపక్షాలు.. ఉభయసభల్లో ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో మంగళవారం సైతం ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ ప్రారంభమైన వెంటనే బిహార్‌లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. అనంతరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైనా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. అంతకుముందు బీహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సహా ఇండియా కూటమి పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు.

రాజ్యసభలో సీఐఎస్ఎఫ్ కమాండోలపై దుమారం

రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలను నిరోధించడానికి సీఐఎస్ఎఫ్ కమాండోలను మోహరించారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. దీంతో ఈ అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభలో సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారని, కాబట్టి ఈ సభను మీరే నడుపుతున్నారా లేక అమిత్ షానా నడుపుతున్నారా అని ఖర్గే ప్రశ్నించగా దీనిపై చైర్మన్ హరివంశ్ నారాయన్ స్పందిస్తూ.. సభలో మార్షల్స్ ఉన్నారని, సీఐఎస్ఎఫ్ జవాన్లు లేరని స్పష్టం చేశారు. ఈ టైంలోనే కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ ప్రతిపక్షాల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఎలా వ్యవహరించాలో ట్యూషన్ తీసుకోవాలని తెలిపారు.

గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు !

బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, గోవా అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. సభలో గందరగోళం మధ్య ‘ది రీడ్ జస్టిమెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ అసెంబ్లీ కాన్‌స్టిటెన్స్ ఆప్ ద స్టేట్ ఆఫ్ గోవా బిల్ -2025’ ను న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా ఈ చట్టం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. ఈ బిల్లు 2024లో దిగువ సభలో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి పెండింగ్ లో ఉంది.

Next Story