Parameshwara: పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు జరగడం కామన్.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర

by B.Srinivas |

కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు తరచుగా జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు.

Parameshwara: పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు జరగడం కామన్.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర (Parameshwara) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు (Bengaluru) వంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు తరచుగా జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. అయితే వీటిని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సుద్దగుంటెపాల్యం భారతి లేఅవుట్‌లోని ఒక వీధిలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

దీనిపై తాజాగా పరమేశ్వర స్పందించారు. ‘బెంగళరూరు ఇలాంటి పెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే అది చట్ట ప్రకారం జరుగుతుంది. పెట్రోలింగ్ పెంచాలని కమిషనర్‌ను ఆదేశించా. నిందితులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. పరమేశ్వర వ్యాఖ్యలపై బీజేపీ నేత షెహజాద్ పూనవాలా (Shehazad poonawala) తీవ్రంగా మండిపడ్డారు. హోం మంత్రి ప్రకటన సిగ్గుపడేలా చేసిందని విమర్శించారు. ‘దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగి మూడు, నాలుగు రోజులు గడిచిపోయాయి. కానీ కర్ణాటక పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. హోం మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

Next Story