Pakistan: అభినందన్‌ వర్థమాన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ మృతి

by Yella Dhawani Reddy |

పాకిస్థాన్ ఆర్మీకి సంబంధించిన కీలక వార్త వెలుగులోకి వచ్చింది.

Pakistan: అభినందన్‌ వర్థమాన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఆర్మీకి సంబంధించిన కీలక వార్త వెలుగులోకి వచ్చింది. భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ (Abhinandan Varthaman)ను 2019లో బంధించిన పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Moiz Abbas Sha) మృతిచెందాడు. అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అబ్బాస్ షా మరణించాడు. ప్రస్తుతం అతడు ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగా అబ్బాస్ షా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. ఈ ఘటన జూన్ 24న జరుగగా, 25న వెలుగులోకి వచ్చింది.

కాగా, 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాదుల సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన భారతదేశాన్ని తీవ్రంగా కలవరపెట్టింది. దీనికి ప్రతిస్పందనగా, ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం పాకిస్థాన్‎లోని బాలకోట్‌లో జైష్ ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఆ మరుసటిరోజు ఫిబ్రవరి 27న పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించగా.. వింగ్‌ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ మిగ్‌-21 విమానంను వెంటాడి దాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకగా అది పాక్‌ భూభాగంలోకి వెళ్లింది. దీంతో అతడిని పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయస్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించింది. చికిత్స కోసం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అభినందన్‌ తిరిగి విధుల్లో చేరి గ్రూప్‌ కెప్టెన్‌గా దేశసేవ చేస్తున్నారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘వీర్‌ చక్ర’ పురస్కారంతో సత్కరించింది.

Next Story