Pakisthan: సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి.. ఆ అగ్రిమెంట్ రద్దుతో భారత్‌కు నష్టమెంత?

by B.Srinivas |

పహెల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Pakisthan: సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి.. ఆ అగ్రిమెంట్ రద్దుతో భారత్‌కు నష్టమెంత?
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ (India pakisthan) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఘటన అనంతరం పాక్‌పై భారత్ పలు చర్యలు తీసుకోగా అందుకు పాకిస్థాన్ సైతం ప్రతిచర్యలకు దిగింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehabaz sharif) అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్‌సీ) గురువారం నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను నిలిపివేయడంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశారు. అలాగే పాక్ గగన తలంలోకి భారత్ విమానాలు రావడాన్ని నిషేధించింది. భారత్ యాజమాన్యంలో నడిచే అన్ని విమానయాన సంస్థలకు పాక్ గగనతలం తక్షణమే మూసివేయనున్నట్టు ప్రకటించింది. భారత్ నుంచి జరిగే అన్ని వ్యాపార కార్యక్రమాలను నిలిపివేసింది.

వాఘా సరిహద్దు మూసివేత

వాఘా సరిహద్దును తక్షణమే మూసివేస్తున్నట్టు ఎన్ఎస్‌సీ సమావేశం అనంతరం పాక్ ప్రకటించింది. అలాగే సిక్కు మత యాత్రికులు మినహాయించి సార్క్ వీసా మినహాయింపు (ఎస్ వీఈఎస్) కింద భారత్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. సిక్కు యాత్రికులు మినహా ప్రస్తుతం ఎస్ వీఈఎస్ వీసా ఉన్న భారతీయ పౌరులు 48 గంటల్లోపు పాక్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత రక్షణ, నావికాదళం, వైమానిక సలహాదారులను ఏప్రిల్ 30 లోగా దేశం విడిచి వెళ్లాలని తెలిపింది. వారిని పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. హైకమిషన్‌లో వారి పదవులు రద్దు చేసినట్టు వెల్లడించింది. సిందూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. పాక్ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఎదురైతే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించింది.

భారత్ పాకిస్థాన్ మధ్య 1972 జూలై 2న సిమ్లా అగ్రిమెంట్ కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టోలు సంతకం చేశారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగిన ఎనిమిది నెలల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడం, భవిష్యత్ లో ఏదైనా వివాదం ఏర్పడితే రెండు దేశాలు పరస్పర అంగీకారంతో తమ విభేదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని అంగీకరించాయి. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోకూడదు. అలాగే ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్ ఎటువంటి షరతులు లేకుండా 90 వేల మంది పాక్ సైనికులను విడుదల చేసింది. అయితే సిమ్లా ఒప్పందం రద్దుతో భారత్ కు ఎటువంటి నష్టం లేదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలు మెరుగుపర్చడంలో ఈ ఒప్పందం ఏ మాత్రం సహాయపడలేదని చెబుతున్నారు. దీంతో పాక్ నిర్ణయం భారత్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమే లేదని అభిప్రాయపడుతున్నారు.

Next Story