Pakisthan: కశ్మీర్ సమస్యపై భారత్‌తో చర్చిస్తాం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

by B.Srinivas |

కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

Pakisthan: కశ్మీర్ సమస్యపై భారత్‌తో చర్చిస్తాం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను భారత్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaj shareef) అన్నారు. తన దేశం కశ్మీరీ ప్రజలకు నిరంతర మద్దతును ఇస్తూనే ఉంటుందని తెలిపారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ముజఫరాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో షరీఫ్ ప్రసంగించారు. కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటుందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ.. భారత్ 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి బయటపడి, ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వెంటనే చర్చలు ప్రారంభించాలన్నారు.

1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పర్యటన సందర్భంగా జరిగిన లాహోర్ డిక్లరేషన్‌ ప్రకారం.. పాకిస్థాన్, భారత్‌లకు చర్చలే ఏకైక మార్గమని తెలిపారు. భారతదేశం ఆయుధాలు కూడబెట్టుకుంటోందని ఆరోపించారు. అయితే ఆయుధాలు శాంతి చేకూర్చవని, ఇవి ఈ ప్రాంత ప్రజల తలరాతను మార్చలేవని నొక్కి చెప్పారు. పురోగతికి ఏకైక మార్గం శాంతి చర్చలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం కశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Next Story