ఉగ్రవాది కాదు.. ఫ్యామిలీ మ్యాన్.. హఫీజ్ అబ్దుర్ రవూఫ్‌‌పై పాక్ బుకాయింపు

by Phanindra |   (  Updated:2025-05-12 17:35:08  IST  )

ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహించిన హఫీజ్ అబ్దుర్ రవూఫ్‌‌. తను టెర్రరిస్టు కాదని పాక్ బుకాయింపు.

ఉగ్రవాది కాదు.. ఫ్యామిలీ మ్యాన్.. హఫీజ్ అబ్దుర్ రవూఫ్‌‌పై పాక్ బుకాయింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ మరోసారి తన సిగ్గులేనితనాన్ని చాటుకుంది. యూఎస్, ఐక్యరాజ్యసమితి సైతం ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తిని ‘సామాన్యుడు, ఫ్యామిలీ మ్యాన్, స్థానిక మతప్రవక్త’ అంటూ బుకాయించేందుకు ప్రయత్నించింది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో హతమైన టెర్రరిస్టులకు ప్రభుత్వ లాంఛనాలతో పాక్ ఆర్మీ, పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని లష్కర్-ఎ-తాయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది హఫీజ్ అబ్దుర్ రవూఫ్ ముందుండి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. భారత విదేశాంగ శాఖ కూడా రవూఫ్ ఉన్న ఫొటోను అంతర్జాతీయ మీడియా ముందుంచింది. దీనిపై తాజాగా పాకిస్తాన్ డీజీఐఎస్‌పీఆర్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించాడు.

రవూఫ్‌కు పాక్‌లో ఇచ్చిన ఐడీ కార్డును చూపించిన చౌదరీ.. ‘తను ఒక ఫ్యామిలీ మ్యాన్. సామాన్యుడు. లోకల్ పార్టీ వర్కర్. మతప్రవక్త. అందుకే ఆయన ముందుండి అంత్యక్రియలు నిర్వహించారు’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. యఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఉగ్రవాది రవూఫ్ వివరాలతోనే ఐడీ తయారుచేసి, అతన్ని స్థానిక మతప్రవక్త అని చౌదరీ చెప్పడం గమనార్హం.

Next Story