IMF: పాక్‌కు రెండో విడత రుణాన్ని మంజూరు చేసిన ఐఎంఎఫ్

by S Gopi |

ఈ రుణాన్ని దీర్ఘకాలిక రుణ కార్యక్రమం ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద పాక్ అందుకుంది.

IMF: పాక్‌కు రెండో విడత రుణాన్ని మంజూరు చేసిన ఐఎంఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) మన శత్రుదేశ పాకిస్తాన్‌కు రెండో విడత రుణాన్ని కూడా జారీ చేసింది. ఐఎంఎఫ్ నుంచి 1.03 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 8,750 కోట్లు) పొందినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ రుణాన్ని దీర్ఘకాలిక రుణ కార్యక్రమం ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద పాక్ అందుకుంది. పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి మొత్తం రూ. 20 వేల కోట్ల వరకు రుణం కావాలని కోరింది. ఇందులో ఈఎఫ్ఎఫ్ కింద రూ. 8,750 కోట్లు, మరో 1.4 బిలియన్ డాలర్లు అంటే రూ. 11 వేల కోట్ల మొత్తం వాతావరణ మరపులకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐఎంఎఫ్ కేటాయించింది. దీని కారణంగా పాకిస్తాన్ విదేశీ నిల్వలు భారీగా పెరిగాయి. ఈ రుణాన్ని గతవారం 9వ తేదీన ఐఎంఎఫ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనే భారత్ పాక్‌కు రుణం ఇవ్వడం గురించి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ భారత్ అభిప్రాయాన్ని కాదని ఐఎంఎఫ్ రుణాన్ని ఆమోదించింది. పాకిస్తాన్‌లో సైన్యమే రాజకీయాలు, ఆర్థికవ్యవస్థపైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనివల్ల ఐఎంఎఫ్ రుణం సంస్కరణలకు కాకుండా ఉగ్రవాదానికి వినియోగిస్తుందనే సందేహాలను వ్యక్తం చేసింది. కాగ, తాజా చెల్లింపులు 2024, సెప్టెంబర్ నుంచి 37 నెలల వరకు కొనసాగే 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణ ఒప్పందంలో భాగం. తాజా మొత్తంతో ఇప్పటివరకు పాక్‌కు 2.1 బిలియన్ డాలర్ల రుణం అందింది.

Next Story