కశ్మీర్ సమస్య తేలాల్సిందే.. లేకపోతే భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడవు!

by Phanindra |

కశ్మీర్ సమస్య తేలాల్సిందేనని, అది జరగకుండా భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడవని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు.

కశ్మీర్ సమస్య తేలాల్సిందే.. లేకపోతే భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడవు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎక్కడకు వెళ్లినా భారత్‌ను, కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పాక్‌కు పరిపాటిగా మారింది. తాజాగా లండన్‌లో పాకిస్తాన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు. గాజా, కశ్మీర్ అంశాలు రెండూ ఒకటేనన్నట్లు మాట్లాడిన షరీఫ్.. కశ్మీర్ సమస్య తీరకుండా భారత్‌తో సాధారణ పరిస్థితులు ఏర్పడటం అసాధ్యమన్నారు. ‘భారత్, పాకిస్తాన్ ఇరుగుపొరుగు దేశాలు. కలిసి జీవించడం నేర్చుకోవాలి. కానీ కశ్మీర్ సమస్య తీరకుండా ఈ సంబంధాలు సాధారణ స్థితికి చేరవు. కశ్మీరీలు చిందించిన రక్తం వృధా కాదు’ అని షరీఫ్ అన్నారు.

ఈ సమస్య తీరకుండా భారత్, పాకిస్తాన్ సంబంధాలను మెరుగు పరచాలని అనుకునే వాళ్లు ఊహాలోకంలో ఉన్నట్లేనని చెప్పారు. ‘మేం నాలుగు యుద్ధాలు చేశాం. వందల కోట్లు ఖర్చుపెట్టాం. ఆ డబ్బును పాకిస్తాన్ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సింది’ అని ఆయన గుర్తుచేశారు. భారత్ గొడవపడే విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించిన ఆయన.. యుద్ధం కావాలో? శాంతి కావాలో? తేల్చుకోవాల్సింది తామేనని, ఇరుదేశాలు ఒకరినొకరు గౌరవించుకుంటూ బతకాలనేదే తమ కోరిక అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్దాన్ని కూడా ప్రస్తావించిన షరీఫ్.. గాజాలో 64 వేల మందికిపైగా ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని, వారికి ఆహారం కూడా అందకుండా అడ్డుకున్నారని విమర్శించారు.

Next Story