Pakistan: ప్రతీకార చర్యలకు దిగిన పాక్..!

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేయగా.. పాక్ ప్రతీకార చర్యలకు దిగింది.

Pakistan: ప్రతీకార చర్యలకు దిగిన పాక్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ ఉత్తర్వులు జారీ చేయగా.. పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపైనా బ్యాన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. పాక్‌ నౌకలు కూడా భారత్‌లోని రేవులకు వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. "పొరుగు దేశంతో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా, సముద్ర సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలు, జాతీయ భద్రతను కాపాడటానికి పాకిస్తాన్ తక్షణమే ఈ చర్యలు చేపట్టింది. భారతీయ జెండా ఉన్నా నౌకలు పాక్ లోని ఏ ఓడరేవును వాడుకోవడానికి వీళ్లేదు" అని పాక్ వార్తాపత్రిక డాన్ నివేదించింది.

పాకిస్థాన్‌పై మరిన్ని ఆంక్షలు

పాక్‌ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాకిస్థాన్‌ నుంచి భారత్ కు రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్‌ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్‌ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్‌ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆ దేశం నుంచి భారత్‌కు వివిధ మార్గాల్లో వచ్చే అన్నిరకాల మెయిల్స్, పార్సిల్స్ రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Next Story