ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండోసారి అమెరికా వెళ్లిన ఆసిమ్ మునీర్!

by Phanindra |

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెండోసారి అమెరికా వెళ్లారు. అక్కడ కీలక నేతలను కలిసినట్లు పాక్ ఆర్మీ చెప్పింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండోసారి అమెరికా వెళ్లిన ఆసిమ్ మునీర్!
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన ఇలా యూఎస్ వెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ధ్రువీకరించింది. వాషింగ్టన్‌లో పలువురు కీలక రాజకీయ, మిలిటరీ లీడర్లను మునీర్ కలిసినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. సీనియర్ నేతలతో చర్చలు జరపడంతోపాటు యూఎస్‌లోని పాక్ డయాస్పోరాతో కూడా ఆయన ముచ్చటించారని తెలుస్తోంది.

అమెరికాకు మునీర్ ఎప్పుడు వెళ్లిందీ పాక్ ఆర్మీ వెల్లడించలేదు. అయితే టంపాలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ ఇ. కురిల్లా రిటైర్‌మెంట్ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అలాగే చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్‌ను కలిసి కీలక చర్చలు జరిపారు. అనంతరం పాక్‌కు రావాలని డాన్ కైన్‌ను ఆహ్వానించారు. అలాగే పాక్ మిత్రదేశాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌లను కూడా మునీర్ కలిసినట్లు తెలుస్తోంది.

యూఎస్‌లోని పాకిస్తానీ కమ్యూనిటీని కూడా కలిసిన ఆయన.. పాక్‌లో పెట్టుబడులు పెంచేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. అదే సమయంలో పాక్ అభివృద్ధిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని వారికి ధైర్యం చెప్పారు. కాగా, జూన్‌లో కూడా ఐదు రోజుల యూఎస్ పర్యటనకు మునీర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ట్రంప్‌తో లంచ్ కూడా చేశారు. ఇలా పాక్ ఆర్మీ చీఫ్‌తో యూఎస్ ప్రెసిడెంట్ నేరుగా కలవడం అదే తొలిసారి.

సాధారణంగా ఒక దేశాధ్యక్షుడిని ఇతర దేశాధినేతలే ఇలా నేరుగా కలుస్తారు. కానీ పాక్ ప్రధానిని కాదని, మునీర్‌ను ట్రంప్ కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఇప్పుడు యూఎస్‌లో పర్యటిస్తున్న మునీర్.. మళ్లీ ఎన్ని రోజుల్లో తిరిగొస్తారనే విషయాన్ని కూడా పాక్ ఆర్మీ వెల్లడించలేదు.

Next Story