- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pak: పాక్‌కు ఔషధాల కొరత
పాకిస్తాన్ వైద్య అధికారులు ఔషధ సరఫరాల కోసం 'అత్యవసర ' చర్యలను ప్రారంభించినట్టు శనివారం ఆ దేశ మీడియా తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్‌గామ్ దాడికి ప్రతికారంగా పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. భారత్ చర్యలకు బదులుగా ఏమీ ప్రకటించకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో పాక్ ప్రభుత్వం పౌరుషానికి పోయి వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నామని ప్రకటించింది. అయితే, పాక్ ఈ ప్రకటన చేసి రెండు రోజులు గడవకముందే కష్టాలను ఎదుర్కొంటోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవడంతో పాకిస్తాన్ వైద్య అధికారులు ఔషధ సరఫరాల కోసం 'అత్యవసర ' చర్యలను ప్రారంభించినట్టు శనివారం ఆ దేశ మీడియా తెలిపింది. జియో న్యూస్ ప్రకారం, భారత్‌తో వాణిజ్యం నిలిపేయడం వల్ల దేశంలో ఫార్మాస్యూటికల్ అవసరాల నిల్వకు అత్యవసర చర్యలు మొదలయ్యాయి. అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ అత్యవసర ప్రణాళికలు అమల్లో ఉన్నాయని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్(డీఆర్ఏపీ) ధృవీకరించింది. 2019 కొవిడ్ సంక్షోభం తర్వాత ప్రభుత్వం ఇటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఔషధ నిల్వలను కొనసాగిస్తోంది. అయితే, ఈసారి పరిస్థితులు భిన్నం. దేశంలో కావాల్సిన ఔషధ అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని డీఆర్ఏపీ సీనియర్ అధికారి చెప్పారని జియో న్యూస్ పేర్కొంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయం కోసం చైనా, రష్యా, పలు యూరప్ దేశాల వైపు చూస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), వివిధ అధునాత చికిత్స ఉత్పత్తులు సహా 30-40 శాతం ముడి పదార్థాల కోసం పాక్ భారత్‌పైనే ఆధారపడుతోంది.
ప్రధానంగా రోజువారీ అవసరాలకు కావాల్సిన యాంటీ-రేబిస్ టీకాలు, యాంటీ-స్నేక్ వెనమ్, క్యాన్సర్ థెరపీలు, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇతర కీలకమైన ఉత్పత్తులతో సహా అవసరమైన వైద్య సామాగ్రి లభ్యత కోసం పాక్ ప్రయాస పడుతోంది. ఔషధాల సరఫరాలో అంతరాయం ఏర్పడితే తీవ్రమైన కొరత ఏర్పడుతుందని పాకిస్తాన్ ఔషధ రంగం భయపడుతోంది.
మరోవైపు, దేశంలో ఔషధాల కొరత ఏర్పడితే బ్లాక్ మార్కెట్ మరింత విజృంభిస్తుందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని, ఆమోదం లేని ఔషధాలు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, ఇతర సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని జియో న్యూస్ వివరించింది. భారత్‌లో తెగిన వాణిజ్య బంధం వల్ల ఏర్పడే కొరతకు ఈ బ్లాక్ మార్కెట్ కొంత సహకారం అందించినప్పటికీ వాటి నాణ్యత, సరఫరాపై ఎలాంటి హామీ ఉండకపోవడం మరింత ప్రమాదకరమని అక్కడి అధికారులు భావిస్తున్నారు.






