Pak Spy: రోజుకు రూ.200 తీసుకుని పాక్‌కు గూఢచర్యం.. నిందితుడిని అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్

by vinod kumar |
Pak Spy: రోజుకు రూ.200 తీసుకుని పాక్‌కు గూఢచర్యం.. నిందితుడిని అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నౌకల తరలింపునకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే అరోపణలతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) శుక్రవారం ఓ నిందితుడిని అరెస్టు చేసింది. నిందితుడు ఓఖా బీచ్‌లోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని, దీని ముసుగులో ఓఖా, ద్వారక, జామ్‌నగర్‌ నుంచి భారత సైనికుల సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపేవాడని తెలిపింది. ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సముద్ర సరిహద్దుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం కొంతకాలంగా పాక్‌కు చేరుతోంది. దీనిపై అనుమానం రావడంతో ద్వారకా జిల్లాలోని ఓఖా జెట్టీలో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తు్న్న దీపేష్ గోహెల్‌పై అధికారులు నిఘా పెట్టారు. అతని ఫోన్‌కు పాక్ నుంచి కాల్స్ రావడాన్ని గుర్తించి తాజాగా అరెస్ట్ చేశారు.

నిందితుడు రోజుకు రూ. 200 చొప్పున తీసుకుని జెట్టీకి వచ్చే ఐసీజీ షిప్‌ల సమాచారాన్ని ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాక్‌కు చెందిన ఓ మహిళకు చేరవేస్తున్నట్టు విచారణలో వెల్లడించారు. దీపేష్ గోహెల్‌కు సొంతంగా బ్యాంక్ ఖాతా లేకపోవడంతో, అతను తన ముగ్గురు స్నేహితుల ఖాతా వివరాలను ఇచ్చాడు. వారంతా సదరు మహిళ నుంచి గత ఏడు నెలల్లో యూపీఐ ద్వారా మొత్తం రూ. 42,000 అందుకున్నారు. దీపేష్ గోహెల్ ఆ డిపాజిట్లకు వ్యతిరేకంగా తన స్నేహితుల నుంచి నగదు తీసుకునేవాడని ఏటీఎస్ ఉన్నతాధికారి సిద్ధార్థ్ తెలిపారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 61, 147ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed