- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahalgam Attack: పహెల్గాం ఉగ్రదాడిపై అధికారులతో మోడీ కీలక చర్చలు.. మరోసారి సర్జికల్ స్ట్రైక్?
పహెల్గాం దాడికి ప్రతీకారంగా మోడీ యాక్షన్ ప్లాన్ పై జోరుగా చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్గాంలో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) పేట్రేగిపోయిన ఘటన యావత్ భారత దేశాన్ని కలచివేసింది. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు నిమిషాల వ్యవధిలోనే పర్యాటకులపై విరుచుకుపడుతూ రక్తపుటేరులు పారించడంపై భారతీయుల రక్తం మరిగిపోతున్నది. ఈ దాడిలో 26 మంది అమాయక ప్రజలు చనిపోగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఉగ్రదాడి సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన స్వదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని మోడీ విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయి ఉగ్రదాడిపై చర్చించారు.
పీఎం ఏం చేయబోతున్నారు?
ఈ ఘటనలో ఉగ్రవాదులు పర్యాటకుల మతం అడిగి మరీ మారణకాండ సృష్టించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నది. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే ‘నా భర్తను చంపారుగా నన్ను కూడా చంపేయండి’ అని మంజునాథ్ భార్య పల్లవి ఉగ్రవాదులను అడగగా ‘మేము నిన్ను చంపం.. పోయి ఇక్కడ జరిగింది మోడీకి చెప్పు’ అని ఉగ్రవాదులు బదులిచ్చారని దాడి అనంతరం ఆమె వెల్లడించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనలో మోడీ (PM Modi) పేరును ప్రస్తావిస్తూ ఉగ్రవాదులు చేసిన మారణకాండ నేరుగా పీఎం ఇగోను టచ్ చేయడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉరి సెక్టార్‌లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ జరిపింది. అయితే ఇప్పుడు ఆర్టికల్ 317 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తొలగిపోయిందని, అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పామని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పుకుంటోంది. ఇటువంటి తరుణంలో ఈ దాడి జరగడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరో సర్జికల్ స్ట్రైక్?
పహెల్గాం దాడి గతంలో జరిగిన పుల్వామా కంటే పెద్ద దాడి అని పలువురు రాజకీయ నేతలు, మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రలోని బీజేపీ సర్కార్ వైఫల్యం వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోయారని, ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి ఐడీ కార్డులు చూసి మరీ ప్లాన్ ప్రకారం మారణకాండ సృష్టిస్తే ఈ విషయాన్ని నిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేకపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేశామని ప్రకటించిన అమిత్ షా ఈ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ మారణకాండకు నరేంద్ర మోడీ సర్కార్ ఎలా బదులివ్వబోతున్నదనేది ఉత్కంఠగా మారింది. గతంలో మాదిరిగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ (surgical strike) చేసి ప్రతీకారం తీర్చుకోబోతున్నదా? అని చర్చించుకుంటున్నారు.
హమాస్ ఎటాక్‌తో పోలిక
పహెల్గాం ఉగ్రదాడి హమాస్ (Hamas) తరహాలో జరిగిందని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి చేసింది పాకిస్తాన్ ఎస్ఎస్‌జీ కమాండోలేనని పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇవాళ ఆయన ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ దాడిని పుల్వామా 2.0గా భావించాలని, రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా అన్న మాటలు కావన్నారు. ఉగ్రవాదులు ఓ మతానికి చెందిన పర్యాటకులను టార్గెట్‌గా చేసుకున్నారు. అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ ఎలా దాడి చేసిందో ఇప్పుడు వీళ్లు అలాగే దాడి చేశారు. హమాస్ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో భారత్ కూడా అలానే చేయాలని అన్నారు. పహెల్గాం దాడి పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని, పాక్ ఆర్మీ చీఫ్ తానెంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారని అందులో భాగంగానే ఈ ఎటాక్ జరిగిందన్నారు.






