Kedarnath Dham: తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం.. ఒక్కరోజే 30 వేల మంది సందర్శన

by Shamantha N |

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Kedarnath Dham: తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం.. ఒక్కరోజే 30 వేల మంది సందర్శన
X

దిశ, నేషనల్ బ్యూరో: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కేదార్‌నాథుని ఆలయ తలుపులు తెరచుకున్నాయి. ఈ సందర్భంగా నేపాల్, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాల నుంచి తెప్పించిన గులాబీ, బంతి సహా 54 రకాల 108 క్వింటాళ్ల పూలతో ఈ హిమాలయ ఆలయాన్ని అలంకరించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా బద్రీనాథ్‌ ఆలయం మే 4న ప్రారంభం కానుంది. ఈ సారి కొత్తగా వారణాసి, రిషికేశ్, హరిద్వార్‌లలో నిర్వహించే గంగా హారతి మాదిరిగానే ఇక్కడ ఆలయానికి సమీపంలో మందాకిని, సరస్వతి నదుల సంగమం వద్ద మహా హారతి నిర్వహించనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ(బీకేటీసీ) సీఈవో విజయ్‌ తెలిపారు.

30 వేల మందికి పైగా..

ఇకపోతే, అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా.. 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్ర‌తి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు.

Next Story