- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లలో విదేశాల్లో 1,900 పైగా భారతీయులు ఆత్మహత్య.. పార్లమెంట్‍కు వెల్లడించిన కేంద్రం
విదేశాల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. 70 శాతం మంది ఆ దేశాల్లోనే సూసైడ్ చేసుకున్నట్లు కేంద్రం తాజాగా పార్లమెంట్‍కు వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెక్కలముక్కలు చేసుకునైనా కుటుంబం కోసం నాలుగు రాళ్లు వెనుకేసుకొద్దామని దేశాలు దాటి వెళ్తున్న మనోళ్ల బతుకులు విదేశాల్లోనే తెల్లారుతున్నాయి. అప్పులు చేసి మరీ కన్నవారిని, భార్యాపిల్లలను వదిలి సముద్రాలు దాటి వెళ్లిన మన వారి బతుకులు అక్కడే ఆగమవుతున్నాయి. విదేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న మన వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో (2023–2025) విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్ సభలో వెల్లడించిన గణాంకాలు షాక్‍కు గురి చేస్తున్నాయి. ఈ మూడేళ్ల కాలంలో విదేశాల్లో 1,900 మందికి పైగా భారతీయులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో 70 శాతానికి పైగా మరణాలు గల్ఫ్ దేశాల్లోనే సంభవించినట్లు పేర్కొంది.
ఏ దేశంలో ఎంత మంది?:
కాంగ్రెస్ ఎంపీలు సత్పాల్ బ్రహ్మచారి, జై ప్రకాశ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం అందించిన వివరాల ప్రకారం.. మూడేళ్లలో మొత్తం 1,340 మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. యూఏఈ (UAE)లో 511, సౌదీ అరేబియాలో 354, కువైట్‍లో 162, ఒమన్‍లో 146, బహ్రెయిన్‍లో 101, ఖతార్‍లో 66 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపింది.
ఇతర దేశాల్లో..
గల్ఫ్ తర్వాత మలేషియాలో అత్యధికంగా 131 ఆత్మహత్య కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. అమెరికాలో 62 మంది ఆత్మహత్య చేసుకోగా.. ఇటలీ, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లలో ఒక్కో దేశంలో 30కి పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. గతంతో పోలిస్తే విదేశాల్లో భారతీయుల ఆత్మహత్యల సగటు సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు 2014 నుండి 2022 మధ్య (ఎనిమిదేళ్లలో) 4,005 ఆత్మహత్యలు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇక పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల వల్ల సంభవించిన మరణాల్లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. ఈ దేశంలో 182 పని చేసే చోట ప్రమాదం వల్ల మరణించగా యూఏఈలో 128, అమెరికా 46, కెనడా 40, సింగపూర్ 32, మాల్దీవులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మహత్యలకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం పేర్కొననప్పటికీ, విదేశాల్లో పనిచేసే కార్మికుల రక్షణ కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా 'ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్' కేటగిరీ కార్మికులకు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' కింద రూ. 10 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు.






