Bangladesh: షేక్ హసీనాపై బంగ్లాదేశ్ సంచలన ఆరోపణలు

by Shamantha N |   (  Updated:2025-04-02 12:52:29  IST  )

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్‌ హసీనా భారత్ లో తలదాచుకుంటున్నారు. కాగా.. ఆమెపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజర్‌ మహఫూజ్ ఆలం తీవ్ర విమర్శలు చేశారు.

Bangladesh: షేక్ హసీనాపై బంగ్లాదేశ్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్‌ హసీనా భారత్ లో తలదాచుకుంటున్నారు. కాగా.. ఆమెపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజర్‌ మహఫూజ్ ఆలం తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌లో కూర్చొని ఆమె తన సొంత దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని బంగ్లా (Bangladesh) ఆరోపించారు. రంజాన్‌ సందర్భంగా ఢాకాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలం పాల్గొన్నారు. హసీనా ప్రభుత్వ హయాంలో అదృశ్యమైనవారు, ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే మాజీ ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగానే హసీనా దేశంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. ఎదురుతిరిగిన వారి ప్రాణాలు తీశారు. 2013-14 మధ్య ఓటు హక్కు కోసం ప్రజలు పోరాడుతున్న సమయంలో చాలా మంది అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆమె ఎన్నో దారుణాలు చేశారు. అవామీ లీగ్‌ను వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదులు, మిలిటెంట్లుగా ముద్ర వేసి వారిని కన్పించకుండా చేశారు. ఇప్పుడు కూడా భారత్‌లో కూర్చుని బంగ్లాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. హసీనాతో పాటు దాదాపు లక్ష మందికి పైగా అవామీ లీగ్‌ కార్యకర్తలు ఆ దేశానికి పారిపోయారు. వారికి భారత్‌ ఆశ్రయం ఇవ్వడం దురదృష్టకరం’’ అని ఆలం ఆరోపించారు.

భారత్ కు పారిపోయిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అవి కాస్తా హింసాత్మకంగా మారడంతో వందలాది మంది చనిపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. స్వదేశంలో హసీనాపై 100కు పైగా కేసులున్నాయి. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.

Next Story