'కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు'.. కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

మా పార్టీ మహిళా వ్యతిరేకి కావొచ్చు కానీ నేను కాదని శశిథరూర్ నాతో అన్నారడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు.. కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం అధికార, విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళాల పట్ల ప్రతిపక్షాలకు ముఖ్యంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదంటూ ప్రధాని మోడీ సహా ఎన్డీయే విమర్శలు గుప్పిస్తున్న వేళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 'మహిళా వ్యతిరేకి' అని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ అంగీకరించారని కిరణ్ రిజిజు తాజాగా ఓ న్యూస్ ఎజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత శశి థరూర్‌తో తాను జరిపిన ప్రైవేట్ సంభాషణ గురించి కిరణ్ రిజిజు ఈ సందర్భంగా పంచుకున్నారు. థరూర్ నాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి కావచ్చు, కానీ ఎవరూ శశి థరూర్‌ను మహిళా వ్యతిరేకి అని అనలేరు అన్నారని దానికి నేను స్పందిస్తూ.. అవును, మిమ్మల్ని ఎవరూ అలా అనరు, కానీ మీ పార్టీ మాత్రం మహిళా వ్యతిరేకి అని అంగీకరించానని రిజిజు తెలిపారు. థరూర్ చేసిన ఈ వ్యాఖ్య, పరోక్షంగా తన పార్టీని మహిళా వ్యతిరేకిగా అంగీకరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

బిల్లు నెగ్గదని బీజేపీకి ముందే తెలుసా?:

ఈ బిల్లు నెగ్గదని బీజేపీకి ముందే తెలుసని వస్తున్న విమర్శలపై కిరణ్ రిజిజు స్పందించారు. ఇది ముందస్తు జ్ఞానానికి సంబంధించిన విషయం కాదని మహిళలకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎవరు ఊహిస్తారు? కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీలు దీనిని వ్యతిరేకిస్తాయని కలలో కూడా ఎవరు ఊహించి ఉండరన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను ఈ బిల్లుతో ముడిపెడుతున్నారన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, ఈ నిబంధన అప్పటికే 2023 చట్టంలో భాగంగానే ఉందని మరి అప్పుడు వారెందుకు దీనిని వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.

మోడీని టార్గెట్ చేస్తే భవిష్యత్ పతనమే:

మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటు వేసే సమయంలో ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని రిజిజు తప్పుబట్టారు. మహిళలకు కల్పించాల్సిన హక్కులను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ (SP) అడ్డుకున్నాయని, దీనిని వారు విజయంగా భావించడం విడ్డూరమని దుయ్యబట్టారు. మహిళలకు రావాల్సిన 33 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్నందుకు దేశంలోని మహిళలు ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్: బెంగాల్‌లో టీఎంసీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, అక్కడ బీజేపీ మాత్రమే మార్పు తీసుకురాగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునే నాయకుల రాజకీయ భవిష్యత్తు పతనం అవుతుందని ఆయన హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అరవింద్ కేజ్రీవాల్ తన సొంత ప్రైవేట్ పార్టీగా మార్చేశారని, అందుకే నిజాయితీ గల నాయకులంతా ఆ పార్టీని వీడుతున్నారని రిజిజు ఆరోపించారు. 2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సొంతపార్టీని ఇరికించారా?:

కాగా కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే శశిథరూర్ సొంతపార్టీనే ఇరికించారా అనే చర్చ జరుగుతోంది. ఇవి ప్రైవేట్ సంభాషణే అయినప్పటికీ ఆయన తమ పార్టీ మహిళా వ్యతిరేకి అని అంగీకరించడం అది కూడా ఓ కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించడం వెనుక ఆయనలో కాంగ్రెస్ పట్ల నిజంగానే కమిట్ మెంట్ ఉందా లేదా పైపైకి హస్తం పార్టీలో కొనసాగుతున్నారా అనే చర్చ తెరపైకి వస్తోంది. నిజానికి గత కొంత కాలంగా శశిథరూర్ రాహుల్ గాంధీ ఎజెండాకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ జైత్రయాత్ర కొనసాగుతున్న సమయంలో విపక్షాలు తొలిసారి మహిళా బిల్లు రూపంలో మోడీ దూకుడుకు బ్రేకులు వేయగలిగింది. ఇటువంటి సయమంలో శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story