భారత విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది.. విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-22 11:37:57  IST  )

ఎన్డీఏ పాలనలో 152 పేపర్లు లీక్ అయ్యాయని, 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

భారత విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది.. విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) అక్రమాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శాంతియుతంగా చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శనలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన దమనకాండపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై, పోలీసుల వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను రాహుల్ గాంధీ మీడియా వేదికగా ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల విషయంలో అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. పారదర్శకమైన విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుకోవడం తప్పా..? శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఈ స్థాయిలో లాఠీఛార్జ్ చేయడం హేయమైన చర్య కాదా.. అని మండిపడ్డారు.

152 పేపర్లు లీక్.. 7.5 కోట్ల మందిపై ప్రభావం

దేశంలో అసలు సరైన విద్యా వ్యవస్థే లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రంలో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. భారత విద్యావిధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో మధ్యతరగతి కుటుంబాలకు విద్య అనేది అత్యంత భారంగా మారిందని, విద్యార్థుల ఆవేదనను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. ‘నీట్’ పరీక్షల నిర్వహణ కోసం రూ.1.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, పరీక్షల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టి విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

పరీక్షల్లో పారదర్శకత లేకపోతే ఎలా?

ఇక నీట్ రాసే ఒక్కో విద్యార్థికి ఏడాదకి రూ.1.32 లక్షల ఖర్చు అవుతోందని రాహుల్ గాంధీ అన్నారు. పైగా దేశ యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని.. విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలు నాశనం చేస్తున్నారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. మరోవైపు దేశంలో చైనా వస్తువుల సంఖ్య పెరిగిందని.. మన పరిశ్రమలు మూతపడుతున్నాయని కామెంట్ చేశారు. బ్యాంకులను బాడా వ్యాపారులు లూఠీ చేస్తున్నారని, ఏఐ వల్ల కార్పొరేట్ రంగంలోని ఉద్యోగాలు కూడా గల్లంతవుతున్నాయని అన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య విద్యార్థులు రాసే పరీక్షల్లో పారదర్శకత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. విద్యా శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని యువత కోరకుకుంటుందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు.

Next Story