ఓడిపోతారని తెలిసి సాకులు వెతుక్కుంటున్నారు.. విపక్షాలపై అమిత్ షా ఫైర్

by Phanindra |

బిహార్‌లో ప్రతిపక్షాలు ఓడిపోతాయని, ఆ విషయం తెలిసే ఆ పార్టీలు సాకులు వెతుక్కుంటున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు.

ఓడిపోతారని తెలిసి సాకులు వెతుక్కుంటున్నారు.. విపక్షాలపై అమిత్ షా ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమి ఖాయమని, ఈ విషయం ఆ పార్టీలకు కూడా తెలుసునని, అందుకే ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ఒక సాకుగా చూపిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొన్నిరోజులుగా ఎస్ఐఆర్‌పై విపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు బిహార్‌లోని సీతామఢిలో జానకీ మందిరం పునర్నిర్మాణానికి అమిత్ షా శంకుస్థాపన చేశారు.

అనంతరం కాంగ్రెస్, ఆర్జేడీపై మండిపడిన ఆయన.. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు బిహార్ యువత ఉద్యోగాలను కొట్టేస్తున్నారని, వారిని కాపాడేందుకే ఎస్‌ఐఆర్‌ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని వాళ్లకు కూడా తెలుసు. అందుకే ఫలితాలను నిరాకరించేందుకు ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కుంటున్నారు’ అని అమిత్ షా అన్నారు. ఎస్ఐఆర్ అనేది కొత్త విధానమేమీ కాదని, జవహర్‌లాల్ నెహ్రూ దీన్ని ప్రారంభించగా 2003లో కూడా ఈ ప్రక్రియ జరిగిందని షా గుర్తుచేశారు.

రాహుల్ గాంధీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆపాలన్న ఆయన.. చేతిలో పట్టుకు తిరిగే రాజ్యాంగాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే భారతీయులకే దేశంలో ఓటు హక్కు ఉండాలనే విషయం అర్థం అవుతుందంటూ చురకలేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ వల్ల ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారులు తొలగిపోతారని చెప్పారు.

Next Story