లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. స్పీకర్ ఓం బిర్లాపై వీగిన అవిశ్వాసం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-11 13:27:20  IST  )

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వీగిపోయింది.

లోక్‌సభలో విపక్షాల ఆందోళన.. స్పీకర్ ఓం బిర్లాపై వీగిన అవిశ్వాసం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఓ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇతర సభ్యులను మాట్లాడనివ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. ఇది అనవసరమైన తీర్మానమని, స్పీకర్ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నమని వారు పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం, సభలో ఎన్డీయే (NDA) కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో మూజువాణి ఓటింగ్ ద్వారా ఈ తీర్మానం వీగిపోయినట్లుగా ప్రకటించారు.

అమిత్ షా కౌంటర్..

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. 18వ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు ఇప్పటివరకు 175 గంటల పాటు మాట్లాడారని. ఇదా గొంతు నొక్కడం అంటూ ప్రశ్నించారు. ఈ తీర్మానం కేవలం ఒక వ్యక్తి అహాన్ని సంతృప్తి పరచడానికేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ మద్దతు..

ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014లో ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన అప్రజాస్వామిక పద్ధతులను గుర్తు చేశారు. అప్పుడు లైవ్‌లు ఆపి బిల్లులు పాస్ చేసిన వారికి స్పీకర్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని విమర్శించారు.

Next Story