ఆలయాన్ని వ్యతిరేకించి.. ఇప్పుడు రాజకీయాలా? కాంగ్రెస్‌పై కంగనా రనౌత్ ఫైర్

by Ramesh Naini |

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు.

ఆలయాన్ని వ్యతిరేకించి.. ఇప్పుడు రాజకీయాలా? కాంగ్రెస్‌పై కంగనా రనౌత్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే అంశంపై రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రదర్శిస్తోన్న ఈ ద్వంద్వ వైఖరిని హిమాచల్ ప్రదేశ్ ప్రజలతో పాటు దేశమంతా గమనిస్తోందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అంతకుముందు రోజు మాట్లాడుతూ.. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేవలం డబ్బు దొంగతనం మాత్రమే కాదని, కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని దొంగిలించడమేనని విమర్శించారు. దీనిపై కంగన స్పందిస్తూ.. కోట్ల మంది భారతీయుల శతాబ్దాల పోరాటం, త్యాగాల ఫలితంగానే రామాలయ నిర్మాణం సాధ్యమైందన్నారు. హిమాచల్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఆలయ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లించడానికి, మతపరమైన సంస్థలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించిందని, అలాంటిది ఇప్పుడు రామాలయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు.

బీజేపీ ఎన్నడూ విశ్వాసాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోలేదని, సనాతన సంస్కృతి రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పవిత్రమైన అంశాలను రాజకీయం చేస్తోందని విమర్శించారు. మరోవైపు, హిమాచల్ కాంగ్రెస్ నేత, మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. ఇదే విరాళాల చోరీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే, బీజేపీ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి ఉండేదన్నారు.

ఎనిమిది మంది అరెస్ట్.. ట్రస్ట్ సభ్యుల రాజీనామా

రామాలయ నగదు కానుకల దుర్వినియోగం కేసులో ఉత్తరప్రదేశ్ సిట్ (SIT) ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయగా, ట్రస్ట్ వాటిని ఆమోదించింది. వారి స్థానంలో కృష్ణ మోహన్‌ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు.

Next Story