భారత్ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ ఆపరేషన్ : ప్రధాని మోదీ

by Naga Rani Yarlagadda |

పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి (Pahalgam Terror Attack) భారత నారీశక్తికి సవాల్‌గా మారిందని, ఆ సవాల్‌ వారి వినాశనానికి కారణమైందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.

భారత్ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ ఆపరేషన్ : ప్రధాని మోదీ
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడి (Pahalgam Terror Attack) భారత నారీశక్తికి సవాల్‌గా మారిందని, ఆ సవాల్‌ వారి వినాశనానికి కారణమైందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) మహిళా అధికారిణులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీని గల్లంతు చేశారని ఆయన ప్రశంసించారు. భోపాల్‌లో రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా జరిగిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో (Mahila Swasakthikaran maha sammelan) ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులతోపాటు వారిని ప్రోత్సహించే వారు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందని మోదీ తెలిపారు. ఆ సమయంలో భారత మహిళల సామర్థ్యాన్ని ప్రపంచం చూసిందని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ దాడుల సమయంలో అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలోని మహిళా బీఎస్‌ఎఫ్ బృందం అఖ్నూర్‌లోని ఫార్వర్డ్ పోస్టుల వద్ద మూడు రోజులపాటు పోరాడినట్లు ప్రధాని కొనియాడారు.

“మన సంప్రదాయంలో ‘సిందూర్’ నారీశక్తికి ప్రతీక. పహల్గాంలో ఉగ్రవాదులు మన పౌరుల రక్తం మాత్రమే చూడలేదు, మన సంస్కృతి, సమాజంపై దాడి చేసి విభజించేందుకు ప్రయత్నించారు. కానీ.. భారత నారీశక్తికి విసిరిన సవాల్ వారికి, వారిని సమర్థించే వారికి శాపంగా మారింది. పాకిస్థాన్ సైన్యం ఊహించని ప్రాంతాల్లో మన సాయుధ దళాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ భారత చరిత్రలో ఒక గొప్ప విజయంగా నిలిచింది.” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఇందౌర్ మెట్రో, దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రయారిటీ కారిడార్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. రూ.483 కోట్లతో నిర్మించిన కొత్త అటల్ గ్రామ సేవా సదన్ (పంచాయత్ భవన్)లకు మొదటి విడత నిధులను బదిలీ చేశారు. 18వ శతాబ్దంలో హోల్కర్ రాజవంశానికి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్‌ను స్మరిస్తూ, ఆమె అసాధారణ పాలన, సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధతను ప్రశంసించారు. ఈ సందర్భంగా రాణి అహల్యాబాయికి అంకితం చేసిన పోస్టల్ స్టాంప్, రూ.300 స్మారక నాణాన్ని ప్రధాని ఆవిష్కరించారు.

Next Story