- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సాగర్ బంధు.. శ్రీలంక నుంచి సురక్షితంగా భారత్‌కు 400 మంది
దిత్వా తుఫాను శ్రీలంక దేశాన్ని అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాల కారణంగా భారీ ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రభుత్వం జాతీయ విపత్తును ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుఫాను (Ditwa Cyclone) శ్రీలంక దేశాన్ని అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాల కారణంగా భారీ ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రభుత్వం జాతీయ విపత్తును ప్రకటించింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 334 మంది మరణించగా మరో 300 మంది ఆచూకీ లభించడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (NDRF teams) స్థానిక అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈ విపత్తుపై ముందస్తుగానే అప్రమత్తం అయిన భారత్ ఆపరేషన్ సాగర్ బంధు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నిరాశ్రయులకు అత్యవసర సరుకులు, ఆహారం, మెడిసిన్ అందించింది. అలాగే వరదల కారణంగా శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు తయారు చేసింది.
ఇందులో భాగంగా రెండు రోజుల్లో శ్రీలంకలోని కొలంబోలో చిక్కుకుపోయిన సుమారు 400 మందికి పైగా భారతీయ పౌరులను (Indian citizens) విజయవంతంగా తరలించారు. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సాగర్ బంధు'లో భాగంగా, చివరి బ్యాచ్‌కు చెందిన ప్రయాణీకులు విమానం ఎక్కే ముందు ఉద్వేగంగా 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారు. ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత హైకమిషన్ ధృవీకరించింది. హైకమిషనర్ సంతోష్ ఝా స్వయంగా బండారు నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) వద్దకు చేరుకుని, స్వదేశానికి బయలుదేరుతున్న చివరి బ్యాచ్ ప్రయాణికులను పరామర్శించారు. తుఫాను ప్రభావంతో విమాన సేవలు రద్దవడంతో వీరంతా విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.
భారత వైమానిక దళం (IAF) ప్రత్యేక విమానాలను (C-130J, IL-76) ఉపయోగించి ఈ తరలింపును చేపట్టింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దాదాపు 400 మందికి పైగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా, సుమారు 150 మందిని ఢిల్లీకి (హిండన్ ఎయిర్‌బేస్) తరలించగా, మరో 250 మందిని తిరువనంతపురం (కేరళ)కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ IAF విమానాలు ముందుగా శ్రీలంకకు తుఫాను సహాయక సామగ్రి, మానవతా సహాయాన్ని అందించడానికి చేరుకున్నాయి. చిక్కుకుపోయిన భారతీయులందరినీ వీలైనంత త్వరగా స్వదేశానికి చేర్చేందుకు వాణిజ్య విమాన సంస్థలు, భారత వైమానిక దళం సమన్వయంతో కృషి చేశాయి.






