Good News: ఏడాది పాటు భారత్ లో చాట్ జీపీటీ గో ఫ్రీ

by Prasad Jukanti |

భారతీయులకు చాట్ జీపీటీ బంపరాఫర్ ప్రకటించింది.

Good News: ఏడాది పాటు భారత్ లో చాట్ జీపీటీ గో ఫ్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐ విప్లవం సాంకేతిక రంగంలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తోంది. రోజుకో కొత్త వెర్షన్‍లతో మానవాళి పరిష్కరించలేని సమస్యలను చిటికెలో సాల్వ్ చేస్తోంది. దీంతో ఏఐ సేవలను అందిస్తున్న సంస్థలు సైతం అంతే అడ్వాన్స్ గా రూపుదిద్దుకుంటూ తమ సేవలను మరింత విస్తృత పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంస్థ ఇటీవల భారత్‍లో అందుబాటులోకి తీసుకువచ్చిన 'చాట్ జీపీటీ గో' (Chat GPT Go) సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాల ప్రమోషనల్ పీరియడ్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుందని తెలిపింది. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే ఉన్న చాట్ జీపీటీ గో సబ్ స్క్రైబర్లకూ ఈ ఫ్రీ ఆఫర్ వర్తించనున్నట్లు సంస్థ పేర్కొంది. భారత్ లో తొలిసారిగా బెంగళూరులో కంపెనీ నిర్వహించనున్న ‘దేవ్ డే’ ఈవెంట్‍కు ముందు ఓపెన్ ఏఐ ఈ నిర్ణయం వెలువరించింది. నిజానికి ఓపెన్ ఏఐ గో గత ఆగస్టులో నెలకు రూ. 399 తో ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అయితే ఏడాది పాటు ఉచితంగా అందించాలని తాజాగా నిర్ణయించారు.

పెర్ప్లెక్సిటీ వర్సెస్ చాట్ జీపీటీ:

ఓపెన్ ఏఐకి అత్యంత వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ ఒకటి. భారత్ ఓపెన్ ఏఐకి రెండవ అతిపెద్ద మార్కెట్‍గా ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) రూపంలో చాట్ జీపీటికీ సవాల్ ఎదురవుతోంది. పెర్ప్లెక్సిటీ ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్ టెల్‍తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక ఏడాది పాటు పెర్ప్లెక్సిటీ ప్రో ప్లాన్ ను యూజర్లకు ఉచితంగా అందిస్తోంది. మరో వైపు భారత్‍లో గూగుల్ సైతం విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. మార్కెట్ లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సైతం ఉచిత ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురావడం ఇండియన్ ఏఐ మార్కెట్‍లో ఈ పోటీ తత్వం ఎలాంటి మార్పులకు కారణం కాబోతోంది అనేది చూడాలి మరి.

Next Story