- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ఇంకా కళ్లెదుటే ఆ నెత్తుటి జ్ఞాపకం
పెహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది: 26 మందిని బలితీసుకున్న ఆ నెత్తుటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ, భారత్ 'ఆపరేషన్ సింధూర్'తో తీర్చుకున్న ప్రతీకారంపై ప్రత్యేక కథనం.

దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం ఒక్కసారిగా భారత దేశం ఉలిక్కిపడింది. ప్రకృతి ఒడిలో పరవశించే పర్యాటకులతో కళకళలాడాల్సిన 'మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే.. పహల్గామ్ (Pahalgam) ఒక్కసారిగా మృత్యుఘోషతో వణికిపోయింది. ఉగ్రవాదులు మతం ఆధారంగా చేసిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని కదిలించింది. 2025 ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఆ దారుణ మారణకాండ కేవలం ఒక ఉగ్రదాడి మాత్రమే కాదు, అది దేశం గర్వించే పర్యాటక రంగంపై జరిగిన గొడ్డలి పెట్టు గా మారింది. నేడు ఆ విచారకరమైన ఘటనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో, నాటి ఉదంతం, ఆపై భారత్ చూపిన తెగువను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకా కళ్లెదుటే ఆ నెత్తుటి జ్ఞాపకం
అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ వ్యాలీ పచ్చని మైదానాల్లో పర్యాటకులు గుర్రపు స్వారీలు చేస్తూ, సెల్ఫీలు దిగుతూ గడుపుతున్నారు. అకస్మాత్తుగా అటవీ ప్రాంతం నుండి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఏకే-47, ఎం 4 కార్బైన్ తుపాకులతో అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ దారుణంలో 26 మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన నవ జంటలు, చిన్నారులు ఉండటం యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) ప్రకటించింది.
భారత్ వీరోచిత స్పందనే 'ఆపరేషన్ సింధూర్'
ఈ నెత్తుటి దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. దాడి జరిగిన 15 రోజుల్లోనే, మే 7-8 తేదీల్లో భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK), పాకిస్తాన్ సరిహద్దుల్లోని సుమారు 9 ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను మన వాయుసేన, పారా కమాండోలు ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా, పాకిస్తాన్ వాయుసేన మౌలిక సదుపాయాల్లో సుమారు 20 శాతాన్ని భారత్ నాశనం చేసి తన సత్తా చాటింది. మే 10న పాక్ దౌత్య పరంగా శాంతి కోసం వేడుకునే వరకు ఈ వేడి తగ్గలేదు.
పర్యాటక రంగంపై ప్రభావం
ఈ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ పర్యాటక రంగం కుదేలైంది. దాదాపు 90 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి. దీంతో పహల్గామ్ ఒక వెన్నెల నగరంలా కాకుండా 'నిశ్శబ్ద నగరంగా మారింది. 2024 తో పోలిస్తే 2025లో పర్యాటకుల సంఖ్య 50 శాతానికి పడిపోయింది. కానీ, ఏడాది తిరిగే సరికి పరిస్థితి మారుతుంది. నేడు పహల్గామ్ సరిహద్దుల్లో అత్యాధునిక డ్రోన్లు, సీసీ కెమెరాలు, అదనపు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తిరిగి వస్తున్న పర్యాటకులు
భయపడటం కంటే ధైర్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని భావిస్తున్న పర్యాటకులు మళ్లీ కాశ్మీర్ బాట పడుతున్నారు. జూలై 3 నుండి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే స్థానిక ప్రజలు సైతం పర్యాటకుల భద్రత కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు భద్రతా సిబ్బందికి సహకరిస్తున్నారు. దీంతో పహల్గామ్ లో మునపటి పరిస్థితులు ఏర్పడుతూ.. పర్యాటకుల సందడి పెరుగుతుంది.
యావత్ దేశానికి పహల్గామ్ దాడి మనకి నేర్పిన పాఠం ఒక్కటే.. శత్రువు ఎంత దారుణంగా దెబ్బకొట్టాలని చూసినా, భారత్ అంతకంటే రెట్టింపు వేగంతో ప్రతీకారం తీర్చుకుంటుంది. నేడు ఆ 26 మంది ఆత్మలకు నివాళులర్పిస్తూ, కాశ్మీర్ లోయలో మళ్లీ శాంతి కపోతాలు ఎగరాలని ఆకాంక్షిద్దాం.






