షాకింగ్.. చనిపోయిన మహిళ అకౌంట్‌లో రూ.1.13 లక్షల కోట్లకు పైగా డబ్బు జమ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-06 05:46:38  IST  )

మన దేశంలో అత్యంత ధనవంతుడు అంటే వెంటనే ముఖేష్ అంబానీ అని చెప్పేస్తాం. కానీ ఓ మహిళ అంబానీ కంటే ధనవంతురాలు అయింది.

షాకింగ్.. చనిపోయిన మహిళ అకౌంట్‌లో రూ.1.13 లక్షల కోట్లకు పైగా డబ్బు జమ
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరని అడిగితే.. వెంటనే ముఖేష్ అంబానీ అని చెప్పేస్తాం. అయితే, తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన సాధారణ మహిళను అంబానీ కంటే ధనవంతురాలిగా మార్చేసింది. ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? అసలు విషయం చెబితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో (Greater Noida) ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. దన్‌కౌర్ ప్రాంతంలో దీపక్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడి తల్లి గాయత్రి దేవి కొద్ది నెలల క్రితం మరణించారు. ఆమె పేరుపై ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) అకౌంట్‌కు ఫోన్ పే క్రియేట్ చేసి దీపక్ కుటుంబ అవసరాల కోసం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే, ఆగస్టు 3న రాత్రి తన ఫోన్‌లో వచ్చిన బ్యాంకు మెసేజ్ చూసి అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ మెసేజ్ ప్రకారం, తన తల్లి ఖాతాలో ఏకంగా రూ.1.13 లక్షల కోట్లకు పైగా (అనగా 1,13,56,00,00,00,00,00,00,00,000) అమౌంట్ క్రెడిట్ అయినట్లుగా ఉంది. ఇంత మొత్తం ఒక్కసారిగా క్రెడిట్ అవ్వటం చూసి అతను కంగారుపడ్డాడు.

మరుసటి రోజు ఉదయం బ్యాంకుకు వెళ్లి ఈ సమాచారాన్ని బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బ్యాంకు అధికారులు సైతం ఈ డబ్బును చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అతడి అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. అనంతరం ఆధాయపు పన్ను శాఖకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇక ఆదాయపు పన్ను శాఖ ఈ భారీ మొత్తం ఎలా జమ అయిందనే దానిపై విచారణ ప్రారంభించింది. అయితే, ఈ లావాదేవీ బ్యాంకింగ్ సాంకేతిక లోపమా, లేక మనీలాండరింగ్ ప్రయత్నమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇక ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర వైరల్‌గా మారింది.

Next Story