- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bangladesh: పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో స్మగ్లర్ల వీరంగం
పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ స్మగ్లర్లు వీరంగం సృష్టించారు. సరిహద్దు భద్రతా దళం (BSF)పై స్మగ్లర్ల బృందం దాడి చేయడంతో సైనికుడు గాయపడ్డాడు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ స్మగ్లర్లు వీరంగం సృష్టించారు. సరిహద్దు భద్రతా దళం (BSF)పై స్మగ్లర్ల బృందం దాడి చేయడంతో సైనికుడు గాయపడ్డాడు. ఒక స్మగ్లర్ చనిపోయాడు. బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని సరిహద్దుల్లో శనివారం ఉదయం 15-20 మంది బంగ్లాదేశ్ స్మగ్లర్ల బృందం పశువులు, నిషిద్ధ వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి యత్నించారు. అంతర్జాతీయ సరిహద్దుని దాటడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో, బీఎస్ఎఫ్ దళాలపై కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో, వారిని చెదరగొట్టడానికి బీఎస్ఎఫ్ సిబ్బంది స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఘర్షణ హింసాత్మకంగా మారడంతో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని గుర్తించారు. స్మగ్లర్లు వాడిన పదునైన ఆయుధాలతో పాటు రెండు పశువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, గాయపడిన జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇకపోతే, భారత్, బంగ్లాదేశ్ 4,096 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్‌తో ఉన్న 900 కి.మీ. సరిహద్దులో దాదాపు 400 కి.మీ. కంచె లేదు. దీంతో, సరిహద్దుల్లో గస్తీ కాయడం సవాలుగా మారింది.






