అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-24 09:07:47  IST  )

అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని, దత్తత అనేది అందుకు ప్రత్యామ్నాయం కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.

అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: గర్భం దాల్చిన మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Suprme Court) అద్భుతమైన తీర్పును వెలువరించింది. పుట్టబోయే బిడ్డను దత్తత ఇవ్వవచ్చు కదా అనే నెపంతో, ఇష్టం లేని గర్భాన్ని మోయాలని ఏ మహిళను బలవంతం చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అదేవిధంగా కేసు విచారణ సందర్భంగా పుట్టబోయే బిడ్డ హక్కుల కంటే గర్భం దాల్చిన మహిళ హక్కులే అత్యంత ముఖ్యమని జస్టిస్ బీవీ నాగరత్న (Justice B.V. Nagarathna), జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ (Justice Ujjal Bhuyan)ల ధర్మాసనం పేర్కొంది. అవాంఛిత గర్భాన్ని బలవంతంగా కొనసాగించమని చెప్పడం మహిళల సంక్షేమాన్ని పక్కన పెట్టడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

దత్తత సాకును తిరస్కరించిన కోర్టు..

బాధితురాలు బిడ్డను పెంచడం ఇష్టం లేకపోతే దత్తత ఇవ్వవచ్చు కదా అని చెప్పడం సులభమని, కానీ అది ఒక మహిళపై గర్భాన్ని రుద్దడానికి సరైన కారణం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఓ మైనర్ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని మోయాల్సి రావడం ఆమెకు తీవ్రమైన మానసిక, శారీరక వేదనను మిగిలిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టులు ఇలాంటి సందర్భాల్లో అనుమతి నిరాకరిస్తే, మహిళలు ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ అక్రమ అబార్షన్ (Illegal Abortion) కేంద్రాలను ఆశ్రయించే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మహిళల గౌరవప్రదంగా జీవించే హక్కుకు Article-21 ప్రకారం విఘాతం కలిగిస్తుందని తెలిపింది.

కాగా, ఈ కేసులో ఏడు నెలల గర్భంతో ఉన్న ఒక 15 ఏళ్ల బాలికకు గర్భస్రావం చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. చట్టపరమైన గడువు దాటినప్పటికీ, బాధితురాలి వయస్సు, ఆమె మానసిక స్థితి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగబద్ధమైన అధికారాలను ఉపయోగించి సుప్రీం ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story