నౌగామ్ పోలీస్ స్టేషన్‌ పేలుడుపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన

by Malleboina Mahesh |

జమ్మూ, కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 11.20 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ J&K విభాగం జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

నౌగామ్ పోలీస్ స్టేషన్‌ పేలుడుపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ, కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 11.20 గంటలకు భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. ఈ పేలుడుపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ J&K విభాగం జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే (Prashant Lokhande) అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం.. నౌగామ్ పోలీసులు ఒక టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించగా, ఆ కేసులో FIR 162/2025 దర్యాప్తు సమయంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, రసాయనాలు స్వాధీనం అయ్యాయి. నియమావళి ప్రకారం.. ఈ పదార్థాలను ఓపెన్ ఏరియాలో భద్రంగా ఉంచి, గత రెండు రోజులుగా సాంకేతిక విధానాల ప్రకారం ఫోరెన్సిక్ పరీక్షల కోసం సిద్ధం చేస్తున్నారు.

ఇవి అస్థిరమైనవిగా, అత్యంత సున్నితమైనవిగా ఉండటంతో నిపుణుల పర్యవేక్షణలో జాగ్రత్తగా నిర్వహణ జరుగుతున్న సమయంలోనే ప్రమాదవశాత్తు భారీ పేలుడు జరిగిందని వారు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 27 మంది పోలీసు సిబ్బంది, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని ఆయన తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారని చెప్పారు. పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, అనవసర ఊహాగానాలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story