ఇన్‌స్టాలో రీ-నీట్‌ పేపర్‌ లీక్‌.. ఫ్యాక్ట్ చెక్ షేర్ చేసిన NTA

by Naga Rani Yarlagadda |

రెండురోజుల్లో దేశవ్యాప్తంగా NEET UG 2026 Re Exam జరగనుంది. ఈ క్రమంలో మరోసారి పేపర్ లీక్ వార్తలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేశాయి.

ఇన్‌స్టాలో రీ-నీట్‌ పేపర్‌ లీక్‌.. ఫ్యాక్ట్ చెక్ షేర్ చేసిన NTA
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండురోజుల్లో దేశవ్యాప్తంగా NEET UG 2026 Re Exam జరగనుంది. ఈ క్రమంలో మరోసారి పేపర్ లీక్ వార్తలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేశాయి. ఇన్ స్టాగ్రామ్ లో నీట్ రీ-ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకైందంటూ వస్తున్న వార్తల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ టీమ్ చేసిన వీడియోను షేర్ చేసింది. నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో నీట్ పరీక్ష బుక్‌లెట్ ప్యాకెట్‌ను తెరుస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. సాధారణంగా అధికారిక నీట్ పరీక్ష బుక్‌లెట్‌తో పాటు ఉండాల్సిన ఓఎమ్‌ఆర్ (OMR) జవాబు పత్రం ఆ వీడియోలోని ప్యాకెట్‌లో లేదని, అంతేకాకుండా ఆ వీడియోలో అనేక తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పిఐబి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది. జూన్ 21, ఆదివారం నాడు జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.

నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం ఎక్కడా లీకవ్వలేదని NTA అధికారికంగా ప్రకటించింది. నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ఏ వ్యక్తికి, సంస్థకు లేదా సోషల్ మీడియాకు పరీక్షకు ముందు ప్రశ్నాపత్రాలను చూసే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. జూన్ 21న జరగబోయే ఈ పరీక్షకు సంబంధించి.. ఇంకా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోనివారికి SMS, వాట్సాప్ ద్వారా రిమైండర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఎన్‌టీఏ నుండి వచ్చే అధికారిక సందేశాలను ఎలా గుర్తించాలో వివరిస్తూ.. కేవలం +91 78279 80287 అనే వెరిఫైడ్ నంబర్ నుండి మాత్రమే తమకు సందేశాలు వస్తాయని సంస్థ స్పష్టం చేసింది. ఈ నంబర్‌కు బ్లూ వెరిఫైడ్ టిక్ మార్క్‌తో పాటు "National Testing Agency" అనే పేరు ఉంటుందని, బ్లూ టిక్ లేని ఏ నంబర్ నుండి సందేశాలు వచ్చినా వాటిని నమ్మవద్దని సూచించింది. అలాగే తాము ఎలాంటి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు అడగబోమని తెలిపింది.

పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డును తీసుకురావాలని, అది లేకపోతే పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు (పాన్ కార్డ్, ఓటర్ ఐడీ వంటివి) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్‌లు, పేజర్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరని, నిషేధిత వస్తువులను భద్రపరిచేందుకు పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి స్టోరేజ్ సౌకర్యం ఉండదని, అభ్యర్థులు తమ సొంత రిస్క్‌పైనే వాటిని బయట ఉంచుకోవాలని ఎన్‌టీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు వదులైన దుస్తులు వేసుకుని రావాలని కోరింది.

Next Story