Turbaned Tornado: దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్‌ను ఢీకొన్న కేసులో ఎన్నారై అరెస్ట్

by S Gopi |

బుధవారం ఆయనను ఢీకొన్న కారును గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు.

Turbaned Tornado: దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్‌ను ఢీకొన్న కేసులో ఎన్నారై అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగానే కాకుండా టర్బన్డ్ టోర్నడోగా పేరున్న ప్రముఖ అథ్లెట్ ఫౌజా సింగ్(114) ఈ వారం ప్రారంభంలో హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. జలంధర్-పఠాన్‌కోట్ నేషనల్ హైవేపై కారు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న ఫౌజా సింగ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తాజాగా బుధవారం ఆయనను ఢీకొన్న కారును గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. జలంధర్‌కు సమీపంలోని ఆయన సొంత గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎన్ఆర్ఐ అమృత్‌పాల్ సింగ్ ఢిల్లో ఈ ఘటనకు కారణమని పంజాబ్ పోలీసు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వాహనాన్ని గుర్తించారు. ఘటన జరిగిన 30 గంటల్లో పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, అతని టయోటా ఫార్చునర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. జలంధర్‌లోని కర్తార్‌పూర్‌లోని దాసుపూర్ గ్రామానికి చెందిన అమృత్‌పాల్ సింగ్‌ను మంగళవారం అర్ధరాత్రి ఆలస్యంగా అదుపులోకి తీసుకుని భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపారు. విచారణలో యాక్సిడెంట్ చేసింది తనే అని అమృత్‌పాల్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. భయంతోనే అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం, పోలీసులు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. జలంధర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్ కెనడాలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల స్వదేశానికి వచ్చిన సమయంలో భోగ్‌పూర్ వెళ్తూ ఫౌజా సింగ్‌ను ఢీకొట్టాడు.

Next Story