ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-07 03:05:18  IST  )

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల.. ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 22 వరకు అశావహుల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజున కౌంటింగ్ చేపట్టి విజేతను ప్రకటించనున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల ఇలా..

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-66 (Article-66) ప్రకారం వైఎస్ ప్రెసిడెంట్‌ను పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజి (Electoral College) ఎన్నుకుంటుంది. 17వ ఉప రాష్ట్రపతి ఎలక్టోరల్‌ కాలేజి పరిధిలోకి రాజ్యసభ నుంచి 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్‌ సభ్యులు.. లోక్‌సభ నుంచి 543 మంది ఎన్నికైన సభ్యులు వస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 5 సీట్లు, లోక్‌సభలో 1 సీటు ఖాళీగా ఉన్నందున మిగిలిన 782 మంది ఉప రాష్ట్రపతి ఓటింగులో పాల్గొననున్నారు. విజయానికి 391 ఓట్లు అవసరం కాగా.. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 422 మంది సభ్యుల బలం ఉంది. పోలింగ్ పక్రియను రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో చేపడుతారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యం తెలిపే అంకె వేయాలి.. అక్షరాల్లో రాయకూడదు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్య అంకెలను బ్యాలెటు రాయవచ్చు. ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్య అంకె తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఉప రాష్ట్రపతి ఓటింగ్ కోసం ఈసీ ఓటర్లకు ప్రత్యేక పెన్నులు సిద్ధం చేసింది. ఇతర పెన్ను వాడితే కౌంటింగులో ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోరు.

Next Story