సీఏఏపై నో స్టే.. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు

by Dishanational6 |
సీఏఏపై నో స్టే.. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. సీఏఏ పై స్టే విధించాలని కోరుతూ పిటిషన్లు వెల్లువెత్తాయి. చట్టాన్ని సవాల్ చేస్తూ మొత్తం 237 పిటిషన్ లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా పిటిష‌న్ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరింది సుప్రీంకోర్టు. అయితే ఈ కేసులో మ‌ళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచార‌ణ ఉంటుంద‌ని తెలిపింది.

సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు చట్టం నిబంధనల అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో.. సీఏఏ అమలు కొనసాగనుంది. మరోవైపు 237 పిటిషన్లపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుందని.. దానికోసం నాలుగు వారాల సమయం కావాలని కోర్టుని కోరారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ఈ చట్టం వల్ల ఏ వ్యక్తి పౌరసత్వం పోదని కోర్టుకు తెలిపారు.

పిటిషనర్లలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్, టీఎంసీ నేత మహువా మొయిత్రా ఉన్నారు. సీఏఏను సవాల్ చేస్తూ ఇండియన్ ముస్లిం లీగ్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. సవాళ్లను అధ్యయనం చేసేందుకు కేంద్రం మరింత సమయం తీసుకంటే వ్యతిరేకించబోమని పిటిషనర్లు కోర్టుకి తెలిపారు. కానీ సీఏఏ అమలుపై మాత్రం స్టే విధించాలని కోర్టుని కోరారు. దానిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

2019లో 1995 నాటి పౌర‌సత్వ చ‌ట్టంలోని సెక్ష‌న్ 2ను స‌వ‌రించారు. దాని ప్ర‌కారం అఫ్గాన్, బంగ్లా, పాక్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్త‌వ మైనార్టీల‌కు పౌర‌స‌త్వాన్ని ఇవ్వ‌నున్నారు. పొరుగు దేశాల్లోని మైనారిటీలు మ‌త‌ప‌ర‌మైన‌ వేధింపుల‌కు గుర‌వుతున్నారని.. వారిని ర‌క్షించాల‌న్న ఉద్దేశంతో ఆ స‌వ‌ర‌ణ చేపట్టింది కేంద్రం.


Next Story