ఓయూలో కరెంట్ సప్లైపై దక్షిణ డిస్కం క్లారిటీ

by Disha Web Desk 4 |
ఓయూలో కరెంట్ సప్లైపై దక్షిణ డిస్కం క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరతతో పాటు విద్యుత్ సమస్య తీవ్రమైందని, ఈ కారణంగా మే 1వ తేదీ నుంచి 31 వరకు హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు వర్సిటీలోని విద్యార్థులకు సోమవారం చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేశారు. వేసవి కారణంగా హాస్టళ్లలో నీరు, విద్యుత్ కొరత ఏర్పడిందని నోటీసులో పేర్కొన్నారు. విద్యార్థులు వర్సిటీకి సహకరించాలని కోరారు. అయితే ఇది చర్చనీయాంశంగా మారింది. ఓయూ అధికారుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉండగా ఎంతో మంది విద్యార్థులు హాస్టల్ లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు. కాగా చీఫ్ వార్డెన్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉండగా నీటి కొరత కారణంగా ఇటీవల విద్యార్థినులు పెద్ద ఎత్తున క్యాంపస్‌లో ఆందోళన చేపట్టారు. వర్సిటీలోని అన్ని హాస్టళ్లను నెల పాటు మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ చేసిన ప్రకటనతో విద్యార్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఓయూ పరిధిలోని హాస్టళ్లలో నీటితో పాటు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని చీఫ్ వార్డెన్ ప్రకటించడంపై ఎస్పీడీసీఎల్ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కాగా దీనిపై సంస్థ వివరణ ఇచ్చుకుంది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. చీఫ్ వార్డెన్ వాస్తవాలేంటో తెలుసుకోకుండా మాట్లాడటంపై సంస్థం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓయూలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి రెండు 11 కేవీల ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా అందజేస్తున్నామని తెలిపారు. కాగా అవాస్తవాలు చెప్పిన చీఫ్ వార్డెన్ కు ఓయూ రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఎస్పీడీసీఎల్ సికింద్రాబాద్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ సంస్థలు ఇటీవల మహబూబ్ నగర్ లో పవర్ కట్ పై వివరణ ఇచ్చుకోగా తాజాగా ఓయూ వర్సిటీ అంశంపైనా త్వరితగతిన స్పందించింది. అయితే ఎస్పీడీసీఎల్ సంస్థ ఓయూ వీసీకి ఇచ్చిన వివరణలో వైస్ చాన్స్ లర్ కు బదులు వైస్ చైర్మన్ గా రాయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

గ్రేటర్ లో 4133 మెగావాట్ల డిమాండ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం 4,133 మెగావాట్లకు చేరింది. గరిష్ట డిమాండ్ నమోదైంది. గతేడాది 29 ఏప్రిల్ లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,109 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 4133 మెగావాట్లకు చేరుకోవడం గమనార్హం. గతేడాదితో పోల్చుకుంటే దాదాపు 32.93 శాతం వినియోగం పెరిగింది. ఈనెల 28న విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 83.04 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. కాగా గతేడాది 30న విద్యుత్ వినియోగం 54.09 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 53.52 శాతం వాడకం పెరిగింది.

Next Story

Most Viewed