మైలారం గుట్టపై మైనింగ్ రద్దు ప్రకటించే వరకు పోరాటం..

by Aamani |
మైలారం గుట్టపై మైనింగ్ రద్దు ప్రకటించే వరకు పోరాటం..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గుట్టపై మైనింగ్ కు వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు గత నెల రోజులుగా అనేక పోరాటాలు చేస్తన్నారు. ప్రభుత్వం తక్షణమే మైనింగ్ ను రద్దు చేస్తామని ప్రకటించే వరకు ఓట్లు వేయమని పార్టీలకతీతంగా మూకుమ్మడిగా గ్రామస్తులందరూ నిన్న ముగిసిన పార్లమెంట్ ఎన్నికలను సైతం బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ప్రతి ప్రాధాన్యత కలిగిన విషయమని కావున మీ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఓటును వినియోగించుకోవాలని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు.

రద్దు చేసే వరకు పోరాటం ఆగదు...

మైలారం గ్రామంలో 1000 పైగా జనాభా ఉంటుంది అలాగే మొత్తం 873 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్ డి ఓ మాధవి గ్రామస్తులను పలు విధాలుగా అవగాహన కలిగిస్తూ ఓట్లు వేయాలని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రామస్తులు మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. చివరి దశలో ఆ రోజు అధికారులు ఆరు ఓట్లు మాత్రమే వేయించి జీరో ఓటింగ్ జరగకుండా చేసే ప్రయత్నంలో సఫలం చెందారు. అయినప్పటికీ మైనింగ్ తీయడం వల్ల గ్రామంతో పాటు పర్యావరణ ముప్పు, చుట్టూ మూడు నాలుగు ఊర్ల మూగజీవాలకు పశుగ్రాసం కొరత, పురాతనమైన ఆలయాల విధ్వంసం, జాతీయ పక్షి నెమళ్లు సుమారు 100 కు పైగా గుట్టపై సంచరిస్తుంటాయని వెరసి మా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది కాబట్టి మా ప్రాణాలు ఎంత ముఖ్యమో మైలారం గుట్ట కూడా అంతే ముఖ్యమని, గుట్టపై మైనింగ్ రద్దు ప్రకటించే వరకు గ్రామస్థులు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

మాట ఇచ్చిన నేతలు ఎక్కడ ?

శాసనసభ ఎన్నికల ముందు మైలారం గుట్టపైన తట్టెడు మట్టి తీస్తే చూస్తూ ఊరుకోమని అక్కడే కుర్చీ వేసుకుని మీ పక్షాన నిలబడతామని నమ్మ బలిసిన ప్రజాప్రతినిధులు ఎక్కడికి పోయారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గ్రామస్తుల అంగీకారం మేరకు కలెక్టర్ తో మాట్లాడి మైనింగ్ తీయకుండా నిలుపుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మైలారం గుట్టపైన తట్టెడు మట్టి కూడా తీయకుండా చూస్తానని గ్రామస్తుల తరఫున ఆందోళన చేసేందుకు సిద్ధమై గ్రామస్తులకు హామీ ఇచ్చిన నాయకులు ప్రస్తుతం మర్చిపోయారా ? కుర్చీ వేసుకుని అక్కడే కూర్చుంటా ? తట్టెడు మట్టి తీయ నియ్యను ? అన్న ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాలు ముఖ్యమా ? లేక బడా కాంట్రాక్టర్లు ముఖ్యమా ? ఆ నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మా పక్షాన ఉండాల్సిన ప్రజాప్రతినిధులు నేడు మైనింగ్ కాంటాక్ట్ కే వత్తాసు పలికేలా... దాటేసే ధోరణితో ఉంటున్న తీరుపై గ్రామస్తులు ప్రజా ప్రతినిధులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

సుదర్శన్ రావు : మైలారం గుట్టపై మైనింగ్ తీయకుండా ఎల్ఓసీ నీ ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ప్రభుత్వం ప్రజల పక్షాన ఆలోచన చేయాలన్నారు.

అరుణ దీప్తి : మైలారం గ్రామస్తులు ప్రజల ప్రాణాలు ఎలాగో మైలారం గుట్ట కూడా అంతే సమానమని పాలకులు ప్రజా సమస్యల వైపు నిలబడాలని డిమాండ్ చేసింది.

రమేష్ గౌడ్ : గత ప్రభుత్వంలో మైలారం గ్రామ గుట్టపై మైనింగ్ తీసేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు అధికారులతో మాట్లాడి మైనింగ్ తీయకుండా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిలుపుదల చేశాడని అలాగే ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం పని చేయాలని కోరారు.

ఎల్లి కంటి పద్మ : మైలారం గుట్టను తవ్వితే మా ప్రాణాలు పోతాయని, ఆస్తి ప్రాణనష్టం జరుగుతుందని, శాసనసభ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రజా నాయకులు ఎక్కడని, నేడు ఎందుకు మా ఊరికి రావడం లేదని ప్రశ్నించారు.

బంగారయ్య : పాలకులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని బడా కంపెనీలకు కాదని కావున మైనింగ్ రద్దు ప్రకటించే వరకు పోరాటం ఆపేది లేదని పాలకులు ఒకసారి మా గురించి ఆలోచన చేయాలన్నారు.

జిల్లా మైనింగ్ డీఈ..

మైలారం గ్రామంలో గుట్టపై మైనింగ్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని జిల్లా మైనింగ్ డి ఈ రవీందర్ ను దిశా ఫోన్ ద్వారా గురువారం వివరణ అడిగింది. ఆయన మాట్లాడుతూ మైలారం గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్ ఆదేశాలతో మా సిబ్బంది గ్రామంలో సంచరించి ప్రజలు తెలిపిన అంశాలను, వాస్తవ పరిస్థితులను పరీక్షించి అందుకు సంబంధించిన పూర్తి నివేదికను రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ కార్యాలయానికి నివేదించామని అందుకు సంబంధించిన తదుపరి నిర్ణయాలు ఉన్నతాధికారుల నుంచి రావాల్సి ఉందన్నారు.

Advertisement

Next Story