పబ్ లో బౌన్సర్, సర్వీస్ కెప్టెన్ మధ్య గొడవ..

by Disha Web Desk 11 |
పబ్ లో బౌన్సర్, సర్వీస్ కెప్టెన్ మధ్య గొడవ..
X

దిశ, శేరిలింగంపల్లి : పబ్ కి వచ్చిన కస్టమర్ విషయంలో పబ్ బౌన్సర్, సర్వీస్ కెప్టెన్ మధ్య ఘర్షణ జరగగా కిచెన్ లోని కత్తితో బౌన్సర్ సర్వీస్ కెప్టెన్ పై దాడికి పాల్పడ్డాడు. అలాగే అడ్డుకోబోయిన మరోకరి పై కూడా దాడి చేయగా మరో ఇద్దరికి గాయాలు అయిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా వైట్ హార్ట్ పబ్ ఉంది. ఈ పబ్ లో కృతిక్(23) అనే యువకుడు సర్వీస్ కెప్టెన్ గా, అమీర్ అనే వ్యక్తి బౌన్సర్ గా పనిచేస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమీర్ కి తెలిసిన వ్యక్తి పబ్ కు వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ చేసి అనంతరం అది బాగాలేదని క్యాన్సల్ చేయాలని చెప్పాడు. అయితే ఒకసారి ఫుడ్ ఆర్డర్ చేసాక క్యాన్సల్ కాదని, కావాలంటే వేరే ఐటమ్ తీసుకు వస్తామని కృతిక్ సదరు కస్టమర్ కి చెప్పాడు. ఈ విషయంలో బౌన్సర్ అమీర్, సర్వీస్ కెప్టెన్ కృతిక్ కు మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవ విషయాన్ని కృతిక్ సమీపంలో కొరియర్ ఉద్యోగం చేసే తన సోదరులు క్రాంతి, కళ్యాణ్ లకు సమాచారం అందించాడు.

క్రాంతి, కళ్యాణ్, తమతో పని చేసే మల్లికార్జున్ అనే వ్యక్తిని వెంట బెట్టుకొని పబ్ కి వెళ్లారు. బౌన్సర్ అమీర్ కు వారికి మధ్య ఘర్షణ తలెత్తడంతో అమీర్ కిచెన్ లో ఉన్న కత్తితో నలుగురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కళ్యాణ్, మల్లికార్జున్ కత్తి పోట్లకు గురయ్యారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story