‘ఇండియా’ గెలిస్తే.. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : ప్రధాని మోడీ

by Hajipasha |
‘ఇండియా’ గెలిస్తే.. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను చేయాలని ఇండియా కూటమి కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత విపక్ష నేతల పగటి కలలు భగ్నం అవుతాయన్నారు. ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత ఏ నేతను బలిపశువుగా చూపించాలనే దానిపైకి ఇండియా కూటమి నేతల చూపు మళ్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌, ఆజంగఢ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. సుస్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం కోసం ఎన్‌డీఏ కూటమినే మళ్లీ గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండియా కూటమి నేతలంతా ఖటా ఖట్ ఖటా ఖట్ అనేలా ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. మేం మాత్రమే ఏకమై నిలబడతాం. మీకు రాత్రింబవళ్లు సేవ చేస్తాం’’ అని మోడీ తెలిపారు. ఎన్నికల ఫలితాలను చూడగానే ఇద్దరు యువరాజులు రాహుల్‌గాంధీ, అఖిలేష్ యాదవ్‌ ఫారిన్ టూర్‌కు బయలుదేరుతారని ఆయన విమర్శించారు. ‘‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఔట్ అయ్యారు.. ఈసారి రాయ్‌బరేలీలోనూ ఔట్ అవుతారు’’ అని మోడీ జోస్యం చెప్పారు. ‘‘ఇండియా కూటమిలోని కొందరు ఓట్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే వాళ్లు పూల బొకేలతో పాకిస్తాన్‌కు వెళ్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ‘నల్లధనం’ ఖజానా ఖాళీ అయిందని.. ఇప్పుడు ఆ పార్టీ కళ్లు దేశ ఖజానాపైనే ఉన్నాయని ప్రధాని ఆరోపించారు.

ఆనాడు మహాత్మాగాంధీయే చెప్పారు..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అసత్య ప్రచారం చేసి, దేశంలో అలజడులు సృష్టించాలని ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. సీఏఏ కింద హిందూ, సిక్కు, జైన, బౌద్ధ వర్గాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. పొరుగు దేశాల్లో నివసిస్తున్న మైనారిటీలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు భారత్‌కు తిరిగి రావచ్చని మహాత్మా గాంధీయే చెప్పారని మోడీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed