SBI: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. ఆక్రమణల కింద ఎస్‍బీఐ బ్యాంకు మెట్లు కూల్చేసిన అధికారులు

by Prasad Jukanti |   (  Updated:2025-11-26 12:57:41  IST  )

ఎస్‍బీఐ బ్యాంకు మరో సారి సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

SBI: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. ఆక్రమణల కింద ఎస్‍బీఐ బ్యాంకు మెట్లు కూల్చేసిన అధికారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా‍లో (SBI) సేవలపై సోషల్ మీడియాలో ఇప్పటికీ రకరకాల ఫన్నీ మీమ్స్, రీల్స్ చూస్తునే ఉంటాం. ఈ బ్యాంకులో సర్వీస్ పొందాలంటే ఎంతో సహనం ఉండాలనే విమర్శ ఉంది. ఈ విమర్శలను నిజం చేసేలా తాజాగా ఒడిశాలోని (Odisha) భద్రక్ (Bhadrak) జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‍లోని పరిస్థితి దర్శనం ఇచ్చింది. ఈ బ్రాంచ్‍లో కస్టమర్లు డబ్బులు వేయాలన్నా, తీసుకోవాలన్నా నిచ్చెన ద్వారా ఫస్ట్ ఫ్లోర్‍కు చేరుకోవాల్సిందే. అలా రిస్క్ చేస్తేనే ఈ బ్రాంచ్‍లో లావాదేవీలు సాగించే పరిస్థితి ఏర్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ నెల 20,21 తేదీలలో చంపర మార్కెట్ నుంచి భద్రక్ రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ క్రమంలో రోడ్డును ఆక్రమించి ఉన్న పలు దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఎస్‍బీఐ బ్రాంచ్ ఉన్న భవనం మెట్లను (SBI Branch Stairs) కూడా అధికారులు తొలగించారు. దాంతో మొదటి అందస్తులో ఉన్న బ్రాంచ్‍కు చేరుకునేందుకు బ్యాంకు సిబ్బందితో పాటు కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా డబ్బులు విత్ డ్రా చేసుకుందామని వచ్చిన కస్టమర్లు బ్యాంకు లోపలికి వెళ్లేందుకు మెట్ల మార్గం లేక షాక్‍కు గురయ్యారు. దాంతో ఓ ట్రాక్టర్ ట్రాపీపై ఓ నిచ్చెనను ఏర్పాటు చేసుకుని దాని సహాయంతో బ్యాంకు లోపలికి వెళ్లి వచ్చేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఇలాగే సాగగా బుధవారం ఆ భవనం యజమాని స్టీల్ మెట్లను ఏర్పాటు చేయించాడు. దీంతో బ్యాంకులోకి సాధారణంగా వెళ్లి రాగలుగుతున్నారు.

పట్టించుకోని భవనం యజమాని:

ఆక్రమణలకు సంబంధించి భవనాల యజమానులకు ఇదివరకే అనేక సార్లు నోటీసులు అందించామని సంబంధిత అధికారులు తెలిపారు. కూల్చివేతలకు రెండు రోజుల ముందు బహిరంగ ప్రకటన కూడా చేశామని దీంతో చాలా మంది దుకాణాదారులు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకున్నారు. కానీ కొంత మంది యజమానుల మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదని అందులో ఎస్‍బీఐ బ్రాంచ్ ఉన్న భవనం యజమాని కూడా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో సబ్-కలెక్టర్, తహశీల్దార్, ఇత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెప్పారు.

Next Story