LIC, EPFO అన్‌క్లెయిమ్డ్‌ నిధులపై కేంద్రం కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2026-07-22 10:01:11  IST  )

LIC, EPFOలలో క్లెయిమ్ చేయని నిధులను ఇతర పథకాలకు మళ్లించే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

LIC, EPFO అన్‌క్లెయిమ్డ్‌ నిధులపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఎవరూ క్లెయిల్ చేయకుండా ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నిధులను ఇతర ఏ అవసరాలకు మళ్లించే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 19 ఆగస్టు 2024 నాటి ఐఆర్‌డిఏఐ (IRDAI) మాస్టర్ సర్క్యులర్ ప్రకారం 10 ఏళ్లకు పైగా క్లెయిమ్ కాకుండా ఉన్న బీమా నిధులను 'సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్' (SCWF)కు బదిలీ చేయాల్సి ఉంటుందని వాటిని మరే ఇతర పనులకు ఉపయోగించే యోచన లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఎల్‌ఐసీ వద్ద రూ. 7,318.50 కోట్లు:

31 మార్చి 2026 నాటికి LIC వద్ద రూ.7,318.50 కోట్ల క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని ఇందులో పాలసీదారులకు చెందిన రూ.5,564.55 కోట్లతో పాటు వాటిపై వచ్చిన రూ.1,753.95 కోట్ల వడ్డీ ఆదాయం కూడా ఉందని మంత్రి తెలిపారు. EPFO ఖాతాలో 31 మార్చి 2026 నాటికి రూ.9,330.56 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ నిధులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓలు అసలైన లబ్ధిదారులను గుర్తించి వారి క్లెయిమ్‌లను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ క్లెయిమ్ ఖాతాల్లోని మొత్తాలను నామినీలకు చేర వేసేలా ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ తమ వంతు కృషి చేస్తున్నాయని చెప్పారు.

పైలట్ ప్రాజెక్టు:

ఎల్‌ఐసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేయని నిధులను వెతుక్కునే సదుపాయం కల్పించడంతో పాటు ఎస్‌ఎంఎస్‌లు, ఉత్తరాలు, ఏజెంట్లు, బీమా సఖీల ద్వారా ఖాతాదారులను సంప్రదిస్తోందని మంత్రి తెలిపారు. అలాగే ఈపీఎఫ్‌ఓలో కేవైసీ (KYC) ఆధారంగా ఖాతాలను వర్గీకరించి రూ. 1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉండి ఆధార్ వెరిఫై అయిన ఇన్-ఆపరేటివ్ ఖాతాల్లోని డబ్బును ఎటువంటి దరఖాస్తులు లేకుండానే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Next Story